గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసిడర్ అఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్ భూషణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ లో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం అన్నారు. భరత్ భూషణ్ మరణం తో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భరత్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.