జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నానని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారని కేసీఆర్ తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫ్రంట్ ఏర్పడలేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఏర్పడబోయే ఫ్రంట్ ఏంటో మున్ముందు తెలుస్తుందన్నారు. అన్ని రంగాలకు చెందిన వివిధ నేతలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాస్త ఓపికగా ఉంటే త్వరలో అన్ని విషయాలు విపులంగా వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. గల్వాన్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని.. అందులో భాగంగా ఈరోజు జార్ఖండ్‌లో రెండు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని కేసీఆర్ తెలిపారు. గల్వాన్ కాల్పుల్లో మరణించిన కల్నల్ సంతోష్ తెలంగాణ బిడ్డేనని.. సంతోష్ కుటుంబంతో పాటు మిగతా అమరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.