Site icon NTV Telugu

CM KCR : తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలి.. మోడీకి లేఖ

తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖ‌లో డిమాండ్ చేశారు. అంతేకాకుండా పంజాబ్, హ‌ర్యానాలో మాదిరిగానే తెలంగాణ‌లోనూ ధాన్యాన్ని సేక‌రించాల‌ని కేసీఆర్ కోరారు. దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అని లేఖలో ఆయన గుర్తు చేశారు.

రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని సేక‌రించ‌క‌పోతే.. కనీస మద్దతు ధరకు అర్థం ఏముంటుందని సీఎం కేసీఆర్ తన లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలా చేయడం ఆహార భద్రతా లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్టే అవుతుందని, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధాన్య సేకరణ విధానం ఉండాలని లేఖలో ప్రస్తావించారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌, వాటి బాధ్యత కూడా కేంద్రానిదే అని, దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.

Exit mobile version