జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఎలా పోరాడబోతున్నానో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. ‘నేను బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐ వంటి పార్టీలతో జైతెలంగాణ అనిపించలేదా. అదీ కేసీఆర్ అంటే. నేను దేశం కోసం పోరాటం మొదలుపెట్టబోతున్నా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అందరూ నాతో వస్తారు. బీజేపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయను. వాళ్ల తప్పులు వాళ్లే పెంచుకునే దాక చూస్తా. వాళ్లకు ఇంకా అహంకారం పెరగాలి. నేను ఎవరికీ భయపడను. ఒకరో ఇద్దరో మా పార్టీ నుంచి వెళ్లిపోతే ఏమవుతుంది? నాతో ప్రజలు లేకపోతే నేను భయపడతా.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను గౌరవించాం. ఏ ఒక్క సామాజిక వర్గాన్నీ విస్మరించలేదు. అన్ని కులాలకూ హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చాం. కేసీఆర్‌ని తీసేయాలన్నా, టీఆర్‌ఎస్‌ని తీసేయాలన్నా ప్రజలు చేయాలి. అధికారం కోసం దొంగ దారులు తొక్కొద్దు. మాకు అన్ని అంశాలపైన స్పష్టత ఉంది. మా పోరాట ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. నేనెంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాను. ఇలాంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడైనా ఉందా?. ఏక్‌నాథ్ షిండేలను తయారుచేస్తే ఏకు మేకై కూర్చుంటారు. నాకు మనీ లేదు. లాండరింగ్ లేదు. కాబట్టి నేనెవరికీ భయపడను. మేము కుంభకోణాలు చెయ్యలేదు.
ఏం చేసినా ప్రజల కోసం మంచి పనులు చేశాం. చెడ్డపనులు చేయలేదు. కాబట్టి ఎవరేం చెప్పినా జనం నమ్మరు. ఎవడో ధరణిని తీసేస్తానంటున్నాడు. ఎంతో మంది ధరణిని మెచ్చుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చినవాళ్లు కూడా తమ పేర్లపై భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళుతూ థ్యాంక్యూ సీఎం. కంటిన్యూ దిస్ అంటూ మెసేజ్‌లు పెట్టారు. రైతుబంధుకు ఎకరాల లిమిట్ పెట్టను. వ్యవసాయాన్ని బలోపేతం చేస్తాను. రైతులు బిచ్చం వేయాలి గానీ బిచ్చం అడుక్కోకూడదు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పటం అంటే ఈస్ట్‌మన్ కలర్స్ చూపించినట్లే.
బీజేపీవాళ్లకు దమ్ముంటే ముందుకు రమ్మనండి. అసెంబ్లీని నేనే రద్దు చేసి ఎన్నికలకు పోతా. ప్రశాంత్ కిషోర్ నాకు ఫ్రెండ్. అంతే. విప్లవాత్మకంగా దళితబంధు తెచ్చాం. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశం మొత్తం అమలుచేస్తానేమోనని బీజేపీవాళ్లు భయపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న 80 కోట్ల ఎకరాల భూమిలో 50 శాతం అంటే 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మనకు అమెరికా, చైనా తరహాలో 4 వేల టీఎంసీల నీటి ప్రాజెక్టులు వద్దా?. 75 ఏళ్ల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటకు రావాలి.
అప్పుడే దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. నరేంద్ర మోడీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేలను తీసుకురావాలి. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటారా? ఇటీవల వర్షాలకు మెయిన్ పిల్లర్ కూలిపోయింది. రాజకీయాల కోసం రైతులను గోస పెడతారా? చివరకు సైన్యాన్ని కూడా వదలరా? నరేంద్ర మోడీ ముసలోడయ్యాడు. ఆయనను కూడా మార్చండి. ఏ మూర్ఖుడూ చేయని పనులను మోడీ చేస్తున్నాడు. వ్యాపారవేత్తలను, రాజకీయవేత్తలను బెదిరించి వాళ్లకు సీబీఐ, ఈడీ నోటీసులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఇండియన్ డెమోక్రసీని బీజేపీ హత్య చేస్తోంది. ఏక్‌నాథ్ షిండేలు వస్తారని ఆ పార్టీ నేతలు బాహాటంగా మాట్లాడుతున్నారు. దేనికైనా లిమిట్ ఉంటుంది. దేశంలోని ఏ వ్యవస్థ పైనా బీజేపీకి గౌరవం లేదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు, దళిత బంధు ఇస్తారా?. మూడు, నాలుగు పార్టీలతో ఫ్రంట్ పెడితే ఏమొస్తుంది? ఆ కిచిడీ ఫ్రంట్ నాలుగు రోజులు కూడా నిలవదు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నా అని కేసీఆర్ విలేకర్ల సమావేశాన్ని ముగించారు.