సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగి పరిశీలించారు. పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు.
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని సిఎం తెలిపారు. సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించాలన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఉండేలా ఆదేశించారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.