మాదాపూర్లో వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్-2 ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 400 కోట్ల రూపాయలతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీ హబ్ ఫేజ్-2 ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నరసింహ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అయితే.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల స్పీకర్లు పనిచేయకపోవడంతో.. బ్లూటూత్ స్పీకర్ తో టీ-హబ్ ప్రతినిథులు సరిపెట్టుకున్నారు. తక్కువ సౌండ్ సిస్టంలొనే సీఎం కేసీఆర్ ప్రసంగించారు. భారత్ లో స్టార్టప్ ఏకో సిస్టం కి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని, రాష్ట్ర స్టార్టప్ పాలసీ కార్పొరేట్ కి, ఎంటర్ప్రెన్యూర్ లకి సహాయపడేలా రూపొందించామని ఆయన వెల్లడించారు.
కలిసి పనిచేస్తూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవాలని, దేశంలో టీ- హబ్ రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఫేజ్ వన్ టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని, టాప్ టెన్ గ్లోబల్ సిస్టం లో మనం ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్, ఫార్మా, అగ్రి, డిఫెన్స్ సిస్టంలలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ లో ఐటీ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఐటీ మినిస్టర్ కేటీఆర్ కి అభినందనలు తెలిపారు కేసీఆర్. విద్యాశాఖని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ ప్రతినిధుల సహకారం కావాలన్నారు.