Site icon NTV Telugu

CM KCR : చుట్టూ చీకటిలో మణిదీపంలా నా తెలంగాణ వెలుగుతోంది

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్‌ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుత్‌ శక్తి అందుబాటులో ఉందన్నారు. ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే కొలమానం విద్యుత్‌ అని, అటువంటి విద్యుత్‌ శక్తి దేశంలో అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించలేని ఆశక్త స్థితిలో భారతదేశం ఉందన్నారు.

4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ శక్తి దేశంలో ఉంటే.. భారతదేశం ఏ రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్‌ శక్తిని వాడడం లేదని కేసీఆర్‌ వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల రాస్తారోకోలు దర్శనమిస్తున్నాయన్నారు. మన చుట్టూ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో కరెంటు కోతలు లేని రాష్ట్రాలు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడని ప్రజలే లేరని ఆయన ఉద్ఘాటించారు.

చుట్టూ చీకటితో అంధకారం ఉంటే.. ఒక మణి దీపంలా వెలుగుతున్నది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 7 ఏళ్ల క్రితం తెలంగాణలో కూడా కరెంటు కోతలు ఉండేవని, కానీ ఆ తెలంగాణ నుంచి ఇప్పుడు 24 గంటలు నిర్వారామంగా కరెంటు ఇచ్చే తెలంగాణగా ఎలా అభివృద్ధి చెందిందో.. అదే దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Exit mobile version