City Civil Court Sent Notice To Parvesh Sharma Manjindar Singh Sirsa In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కవితదే ముఖ్యపాత్ర అంటూ ఆరోపణలు చేసిన ప్రతివాదులు బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని.. సోషల్ మీడియా, మీడియా ముందు ఎవ్వరూ స్పందించకూడదని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే! ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఇలాంటి అక్రమ పద్ధతుల్ని ఎంచుకున్నారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అటు.. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడం వల్లే మీడియాలో కథనాలు వచ్చాయని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రెడ్డి వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ద్వారా నాలుగున్నర కోట్లు మనీష్ సిసోడియాకు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలని.. కానీ వాళ్లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కడిగేశారు.
ఈ నేపథ్యంలోనే పలు మీడియాలో వచ్చిన కథనాల్ని, ఆగస్టు 21 తేదీన మీడియా సమావేశంలో ఆ ఇద్దరు బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోలను మోహిత్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రతివాదులు కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ వాదనలు విన్న అనంతరం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ పర్వేశ్ శర్మ, మంజిందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు ఇచ్చింది.