Site icon NTV Telugu

Chicken Price Effect: బైక్ పై వచ్చి కోళ్ళు కొట్టేశారు

ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు. చికెన్ సెంటర్ ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బ్రాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి మరీ ఎత్తుకెళ్ళిపోయారు.

ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరగడం విశేషం. బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు.

గత రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌ పై వచ్చి దుకాణంలో ఉన్న బ్రాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూసి చోరీ జరిగినట్లు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.

https://ntvtelugu.com/mother-murdered-two-months-baby-girl-in-new-delhi/
Exit mobile version