అమ్నీసియా పబ్ అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నిందుతులపై త్వరగా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీడియాకు చూపారు. అయితే ఈ ఘటనలో మైనర్లు ఉన్నారని.. వారికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు ఎలా చూపిస్తారంటూ రఘునందన్ రావుపై విమర్శలు గుప్పుమన్నాయి. దీనిపై స్పందించిన రఘునందన్ నేను ఎవరీ పేరును ప్రస్తావించలేదని, ఎవరి ముఖం కనిపించేవిధంగా ఫోటోలు, వీడియోలు విడుదల చేయలేదన్నారు.
అంతేకాకుండా తన కంటే ముందే టీవీల్లో వీడియోలు వచ్చాయన్నారు రఘునందన్. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మైనర్ బాలిక ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం పై ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 228A కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. అత్యాచారాలు జరగానికి పబ్‌లే కారణమంటూ.. ఎన్‌ఎస్‌యూఏ నేత బల్మూరి వెంకట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని పబ్‌లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా పబ్ సమయానికి మించి నడుపుతున్నారని బల్మూరి వెంకట్ పబ్‌లో వీరంగం సృష్టించారు. అయితే.. ప్రభుత్వ అనుమతులు ఉన్న బార్లను మూసివేయాలంటూ నిర్వాహకులను బెదిరించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినట్లు బల్మూరి వెంకట్‌పై శంషాబాద్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.