Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మళ్లీ చిక్కుల్లో పడింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యులు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. గత నెల 26తో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం ముగిసిందని హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్, మాజీ సెక్రటరీ శేషు నారాయణ్, మాజీ మెంబర్ చిట్టి శ్రీధర్‌బాబు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హెచ్‌సీఏపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Ishan Kishan: పంత్ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్
అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినా ఆయన తప్పుడు ధృవపత్రాలను సృష్టించి బీసీసీఐ, ఎన్నికల కమిషన్ కమిటీలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని హెచ్‌సీఏ మాజీ సభ్యులు పోలీసులకు వివరించారు. పదవీ కాలం పెంచుకునే విషయంలో అజారుద్దీన్ ఎవరినీ సంప్రదించలేదని వారు ఆరోపించారు. ఆయనే సొంతంగా గడువును పొడిగించుకున్నారని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని, అందులో పాల్గొనేందుకు వీలుగా అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిబంధనలు అతిక్రమించిన అజారుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్ డిమాండ్ చేశారు.