Site icon NTV Telugu

BRS KTR: మార్చి1న చలో మేడిగడ్డ.. తెలంగాణ భవన్ నుంచి 150 మంది బీఆర్‌ఎస్‌ నేతలు

Ktr

Ktr

BRS KTR: బీఆర్‌ఎస్‌ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మార్చి 1న తలపెట్టిన ప్రాజెక్టుల సందర్శనకు తమ వెంట కాంగ్రెస్ మంత్రులను తీసుకెళ్తామని.. కాళేశ్వరం ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం కలిసి వెళతామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ నుంచి 150 మంది ప్రజాప్రతినిధులం మెడిగడ్డ బయలుదేరి వెళతామన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడతామన్నారు. రాష్ట్రం ఏర్పడే దాకా నీళ్ల కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు తెలంగాణకు దక్కలేదన్నారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జల యజ్ఞం పేరుతో దన యజ్ఞం చేశారన్నారు. పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రం లో ఉన్నా కాంగ్రెస్ గోదావరి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చూపించామన్నారు. పబ్లిక్ కు కాళేశ్వరం తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Read also: CM Revanth Reddy: ఏ సమయమైనా సహకరిస్తాం.. ఫార్మా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి హామీ

ప్రజలకు వాస్తవం చూపించేందుకు కాళేశ్వరం వెళ్లబోతున్నామని తెలిపారు. దిగువున పారుతున్న గోదావరిని పైకి తీసుకెళ్లడమే కాళేశ్వరం ప్రాజెక్టు అని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం మల్టీ పర్పస్ ప్రాజెక్టు అన్నారు. కాలువల ద్వారా నీరు మాత్రమే కాదు…చెరువులు, వాగులు నింపడానికి కూడా కాళేశ్వరం నీటిని వాడిన్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో srsp లో 11 ఏళ్ల తర్వాత 25 వేల ఎకరాల కు నీళ్లు వచ్చాయని తెలిపారు. మేడిగడ్డలో రెండు, మూడు పిల్లర్లు పడితే ప్రాజెక్టు మొత్తాన్ని కూల్చివేయాలనే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసీ ప్రాజెక్టు, సింగూరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో సమస్యలు ఉండేవని, దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు చేసేందుకు ఇంజినీరింగ్ పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. సమస్య ఉన్న చోట సులువుగా కాఫర్ డ్యాం నిర్మించి మూడు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి విచారణను స్వాగతిస్తున్నామని… ఎన్ని రాజకీయ విభేదాలు వచ్చినా రైతుల ప్రయోజనాలే ప్రధానమని అన్నారు.

Read also: Ponnam Prabhakar: ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బండి సంజయ్ పై పొన్నం ఫైర్

కాఫర్ డ్యాం నిర్మాణం, మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే వేసవిలో మంచినీళ్లు ఇవ్వబోమని, సాగునీరు తగ్గిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, అవసరమైతే వారిపై దుష్ప్రచారం చేయాలని…ఇంకేమీ చేయొద్దని కోరారు. రైతుల జీవితాలు దెబ్బతినకూడదు. కాంగ్రెస్ మూడు స్తంభాల నష్టాన్ని చూపి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారానికి స్వస్తి చెప్పి ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి సారించాలి. మేడిగడ్డను బాగు చేయకుంటే మూడు బ్యారేజీలను కొట్టుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. వచ్చే వర్షాకాలంలో మూడు బ్యారేజీలను కొట్టుకుపోయేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు.అన్నారం, సుందిళ్ల కూడా కొట్టుకుపోతాయని, ప్రాజెక్టును కడిగేసే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని కేటీఆర్ ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డ పర్యటన వంటి డ్రామాలన్నీ అయిపోయాయి కాబట్టి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Read also: Mahalakshmi Scheme: వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్‌.. మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌..

కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలని, రాష్ట్ర రైతులపై కక్ష సాధింపు ధోరణి సరికాదని, రైతులపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రేమ ఉంటే… తెలంగాణ ప్రాజెక్టు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోయాలన్నారు. కేవలం నేరపూరిత మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ బ్యారేజీలకు మరమ్మతులు చేయకుండా ప్రతిరోజూ వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతోందని ఆరోపించారు. కాగ్ నివేదిక పవిత్ర గ్రంథం కాదని గతంలో కాంగ్రెస్ సీఎంలు, ప్రధానమంత్రులు చెప్పారని గుర్తు చేశారు.కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తిలో రూ.900 కోట్లకు సంబంధించిన పలు అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించిందని, కాగ్ నివేదికలో అప్పట్లో తప్పు ఉంటే ఇప్పుడు ఎలా సరిదిద్దుతారని ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. కాగ్ నివేదిక విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు… భిన్న వాదనలు ఎలా చేస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అప్పులపై కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతుందని… కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కొత్త రుణాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడపాలని డిమాండ్ చేశారు.
Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Exit mobile version