Site icon NTV Telugu

Navneet kaur: జహీరాబాద్‌లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..

Navneet Kaur

Navneet Kaur

Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బీజేపీ నేతల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రముక బీజేపీ నేత, తమిళనాడు చీఫ్ అన్నామలై తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగు వారికి సుపరిచితమైన, టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న నవనీత్ కౌర్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు.

Read Also: Maharashtra: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..

జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌‌కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. నిన్న ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేస్తూ, బీబీ పాటిల్‌ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో బీబీ పాటిల్ తన నియోజకవర్గంలో పనిచేయడం తాను చూశానని అన్నారు. ఈ సారి బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలువందల స్థానాల్లో జహీరాబాద్ కూడా ఒకటని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌కి ఓటేయడం అంటే పాకిస్తాన్‌కి ఓటేయడమని, దాన్ని ఎదురించేందుకే తాను వచ్చానని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు మాత్రమే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అంటారని దుయ్యబట్టారు. గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. ఎస్సీ/ఎస్టీలను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకుంది.

Exit mobile version