Site icon NTV Telugu

BJP National Executive Meeting: బీజేపీ టార్గెట్‌ అదే.. అందుకే హైదరాబాద్‌ వేదికగా సమావేశాలు..!

Bjp National Executive Meeting

Bjp National Executive Meeting

ఇప్పుడు అందరి చూపు తెలంగాణపైనే ఉంది.. గల్లీ నుంచి ఢిల్లీ దాక అనే విధంగా.. హైదరాబాద్‌ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై ఫోకస్‌ పెరిగిపోయింది.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా సహా బీజేపీ అధినాయకత్వం మొత్తం హైదరాబాద్‌ తరలివస్తుంది.. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిటీకి రానుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నారు.. రెండు రోజుల పాటు ఆయన సిటీలోనే మకాం వేయనున్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ బీజేపీలో ఎటు చూసినా కోలాహలం కనిపిస్తోంది.. బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేసిందనే విషయం ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేతల రాష్ట్ర పర్యటనలను బట్టి అర్థమవుతుండగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే బీజేపీ కీలక నేతలు తెలంగాణలో పర్యటించారు.. ఇప్పుడు అధినాయత్వం మొత్తం తరలివస్తుంది.. దీంతో, బీజేపీ హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకుంది? తెలంగాణలో పాగా వేయడమే కమలదళం లక్ష్యమా? అనే చర్చ సాగుతోంది.. ఇది ముమ్మాటికి నిజం.. తెలంగాణ పీఠం ఎక్కడమే టార్గెట్‌, గోల్కొండ కోటాపై కాషాయ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యం అంటున్నారు బీజేపీ నేతలు.. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. అందుకే వరుసగా రాష్ట్రంలో బీజేపీ అగ్రనాయత్వం పర్యటిస్తూనే ఉంది.. అమిత్‌షా, నడ్డా.. కేంద్ర మంత్రులు.. ఇలా ఎవరో ఒకరు.. రాష్ట్రానికి వచ్చిపోతూనే ఉన్నారు. అధికార టీఆర్ఎస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు.

Read Also: BJP National Executive Meeting: నేడు నగరానికి కమళ దళపతి..

ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధం అయ్యింది బీజేపీ అధినాయకత్వం.. పార్టీ శ్రేణులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా.. వారిలో అదే జోష్ కొనసాగేలా.. కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అందులో భాగంగానే హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, ప్రధాని మోడీ కూడా రెండు రోజుల పాటు ఆ సమావేశాల్లో పాల్గొనున్నారు.. మోడీ ప్రధాని అయ్యాక జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇంత సమయం ఇచ్చింది లేదట.. ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడబోతున్నారు. ఇప్పటికే పరిస్థితి టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీగా ఉంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ తప్పుబడుతుంటే.. గులాబీ సర్కార్‌ విధాలను కషాయ పార్టీ కడిగేస్తోంది. ప్రధాని మోడీని కూడా టార్గెట్‌ చేస్తోంది టీఆర్ఎస్‌.. దీంతో.. ప్రధాని ప్రసంగంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనే ఉత్కంఠ నెలకొంది.. బీజేపీ గత అనుభవాలను చూస్తే.. ఏ రాష్ట్రంలోనా ఎన్నికలు వస్తున్నాయంటే.. అక్కడ పార్టీలో ఉత్సాహాన్ని నింపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.. అదే ప్రయోగాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తోంది కమల దళం.

అందులో భాగంగానే హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. నోవాటెల్ హోటల్ ప్రధాని నరేంద్ర మోడీ సహా.. బీజేపీ అగ్రనాయకత్వం బసచేయనుంది.. ఈ సమావేశాలకు బీజేపీకి చెందిన 29 రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది దిగిపోయారు.. అంతే కాదు.. జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా రెరండు రోజులు సిటీ ఉంటే.. పార్టీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మూడు రోజులు మకాం వేయనున్నారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే రెండు దపాలుగా పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నారు.. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినా.. అదే జోష్‌తో ముందుకు సాగుతున్నారు.. ఇప్పుడు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా గట్టిగా వాడుకుంటున్నారు..

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే.. నేతలంతా వచ్చి.. తాజా రాజకీయ పరిస్థితులు, వ్యూహాలు, భవిష్యత్‌ కార్యాచరణ లాంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. కానీ, ఇక్కడ కమలం పార్టీ ప్లాన్‌ చూస్తే అంతా ఆశ్చర్య పోవాల్సిందే.. ఎందుకంటే.. కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే నేతల్లో కొందరు ముందుగానే రాష్ట్రంలో వాలిపోయారు.. తెలంగాణను చుట్టేస్తున్నారు.. ఏ జిల్లాను వదలకుండా పర్యటిస్తున్నారు.. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారంతా తెలంగాణలో వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. నియోజకవర్గ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, మోర్చాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. పదాదికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పుర ప్రముఖులు, వ్యాపారులతో భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లలో భోజనాలు చేశారు. వివిధ గ్రామాల్లో.. అక్కడి దళిత వాడల్లో పర్యటించారు. మొత్తంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతుంటే.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపే పనిలో పడిపోయారు.. టీఆర్ఎస్‌ విధానాలను ఎండగడుతూనే.. ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ తీసుకొచ్చిన పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఎప్పుడు లేని విధంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో అదే జోష్‌తో పనిచేసే విధంగా వారిని సమయత్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జెండా పాతయడమే తమ టార్గెట్‌ అంటున్న కాషాయ పార్టీ నేతలు.. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాలతో మరోసారి రాష్ట్రంపై రాజకీయ దండయాత్ర చేస్తోంది భారతీయ జనతా పార్టీ.

Exit mobile version