ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు రక్షించలేని కేసీఆర్‌కి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల.. ఆర్.కె.పురం డివిజన్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై లైంగిక దాడులు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు, స్థానిక నాయకులు అందరూ బస్తీని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి.. కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు..
Read Also: No Ambulance: తండ్రి భుజాన కొడుకు శవం.. కాలినడకనే ఇంటికి..!
అయితే, బాధ అనిపించే విషయం ఏమిటంటే విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో దేశంలోనే ఎక్కడాలేనన్ని సీసీ కెమెరాలు పెట్టి ప్రతి ఇంచ్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాచ్ చేస్తున్నాం అని.. గొప్ప పోలీసు వ్యవస్థ.. గొప్ప సర్వైలెన్స్ వ్యవస్థ ఎక్కడ లేదు అని సీఎం కేసీఆర్ చెప్పుకుంటారు. కానీ, గత కొద్ది రోజులుగా జరుగుతున్న అత్యాచారాలు, అత్యాచారాలలో పాల్గొంటున్న మైనర్ పిల్లలు చూస్తున్నాం. పదుల సంఖ్యలో మన నోటీసుకు వస్తున్నాయి.. కానీ, వందల సంఖ్యలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్లోరీని, తెలంగాణ గొప్పతనాన్ని ఇలాంటి ఘటనలు మంట గలుపుతున్నాయన్నారు. అమ్మాయిలు, మహిళలపై వేధింపులు తగ్గిస్తామని షీ టీమ్‌లు పెట్టారు. కానీ, పబ్‌లలో, నిర్మానుష్య ప్రాంతాలలో చివరికి కార్లలో తీసుకుపోయి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మన విలువలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? కరిగిపోతున్నాయి అనడానికి ఇలాంటి సంఘటనలు సజీవ సాక్ష్యం అన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట భయం లేకుండా బయటకు పోవచ్చు అని చెప్పుకునే కేసీఆర్ పరిపాలనలో… ప్రజల ప్రాణాలకు, ప్రజల మానాలకి, ప్రజల ఆస్తులకు భరోసా లేకుండా పోయింది. ఈ మొత్తం జరుగుతున్న లైంగిక వేధింపులు, దుర్మార్గమైన చర్యలు, మైనర్లు, అందులో అధికార పార్టీకి అండగా ఉండే వాళ్ల పిల్లలు ఉన్నారు. ఈ సర్కార్‌పై ప్రజలకు విశ్వాసం పోయింది.. కాబట్టి సీబీఐతో విచారణ జరిపించాలని, ప్రజలను కాపాడాలని.. ఈ సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.