హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని, వారి భరతం పడతానని ఈటల వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని ఈటల ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… తనను గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
హుజురాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి కల్పించారని.. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు తనవైపే నిలబడి కేసీఆర్ సర్కారుకు గుణపాఠం చెప్పాలరని ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలకు తన చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తనను భర్తరఫ్ చేసిన తర్వాత తనను అక్కున చేర్చుకున్న బీజేపీకి రుణపడి ఉంటానన్నారు. దళిత బంధు పది సార్లు ఇస్తామని చెప్పినా ప్రజలు వారి మాటలు నమ్మలేదని.. ఓట్ల కోసం స్మశాన వాటికల్లో కూడా డబ్బులు పంచిన నీచులు టీఆర్ఎస్ పార్టీ నేతలు అని విమర్శలు చేశారు. హుజురాబాద్ ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజల అభిప్రాయమని ఈటల పేర్కొన్నారు. రాబోయే కాలంలో బీజేపీని మరింత పటిష్టం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఈటల తెలిపారు.