NTV Telugu Site icon

BJP National Executive Meeting: ఎన్టీఆర్‌ రియల్‌ హీరో, ఆయన దేవుడు..!

Biplab Kumar Deb

Biplab Kumar Deb

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ సీనియర్‌ నేత, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్‌… జాతీయ కార్యకవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన ఆయన.. ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్‌ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని సూచించారు.. ఎనిమిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.. ఇక, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.. టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృస్టించారని పేర్కొన్న ఆయన.. ఎన్టీఆర్ అసలైన హీరో, ఆయన దేవుడంటూ వ్యాఖ్యానించారు బిప్లవ్‌దేవ్‌.. అప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని స్థాయి నుంచి ప్రజాబలంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి చరిత్ర సృష్టించారని తెలిపారు.

Read Also: Puri Rath Yatra 2022: నేటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్ర

మరోవైపు, తమ రాష్రంటోని రాజకీయాలపై స్పందించారు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ దేవ్.. త్రిపురలో కూడా కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలుకొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిందన్న ఆయన.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్‌ వేదికగా జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన నేతలు.. ఇప్పటికే జిల్లాల్లో అడుగుపెట్టారు.. తెలంగాణను చుట్టేస్తున్నారు.. ఏ జిల్లాను వదలకుండా పర్యటిస్తున్నారు.. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. నియోజకవర్గ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, మోర్చాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పుర ప్రముఖులు, వ్యాపారులతో భేటీ అవుతూ.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే పనిలో పడిపోయిన విషయం తెలిసిందే.