Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు

  • 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై అభినందనలు
  • ప్రజా సంక్షేమమే సీఎం లక్ష్యమన్న భట్టి
  • సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై ప్రశంసలు
  • క్షేత్రస్థాయి పాలనకు భట్టి కితాబు
Bhatti

Bhatti

Bhatti Vikramarka : ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం తనను జడ్పీటీసీగా దీవించిన ఈ ప్రాంత ప్రజల చెంతకు, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి రావడం రేవంత్ రెడ్డి గారి ఉన్నతమైన సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. కేవలం అధికారుల సలహాలకే పరిమితం కాకుండా, పేదోడి కష్టాలు స్వయంగా తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రజాపాలన అందిస్తున్నారని, ప్రకృతి కూడా ఆశీర్వదించేంత మంచి సంకల్పంతో ఆయన నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే అజెండాగా చారిత్రాత్మక నిర్ణయాలు

రాష్ట్రంలో ఆకలి లేని సమాజమే లక్ష్యంగా కోటి పదిహేను లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, అలాగే 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో పౌష్టికాహారం అందించడం ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతోందని భట్టి విక్రమార్క వివరించారు. నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అక్కాచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ప్రజా సంక్షేమమే అజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పాలకుల హయాంలో నిరంతరం భయంతో బతికిన తెలంగాణ ప్రజలకు, నేడు నిజమైన స్వేచ్ఛా స్వతంత్ర జీవనాన్ని ప్రసాదించిన ధీశాలి రేవంత్ రెడ్డి అని డిప్యూటీ సీఎం కొనియాడారు.