NTV Telugu Site icon

Bhatti Vikramarka Padayatra: ప్రగతి భవన్‌ను బద్దలు కొడతాం..

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకందిద్దారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో యడవెల్లి హోరెత్తింది. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కగారి పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Read Also: Kodali Nani: ‘భీమ్లా నాయక్‌’ను జగన్ తొక్కేయడమేంటి? జీవో ఇస్తామని చెప్పామా?

తన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు భట్టి విక్రమార్క.. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఈ పాద యాత్ర అని ప్రకటించిన ఆయన.. తెలంగాణ తెచ్చుకున్నది సమస్యలు పోవాలని, అందరికి ఇల్లులు, ఉద్యోగాలు వస్తాయని.. కానీ, అది నెరవేరలేదు… సంపద మొత్తం కొద్ది మంది పాలకుల ఇళ్లలోకి వెళ్తుందని.. పేదల సంపద పెరగడం లేదన్నారు. ఒక్క డీఎస్‌ఈ కూడా రిక్రూట్‌ కాలేదు.. ఏ ఏళ్లు అయినా ఒక్క గ్రూప్‌ వన్‌ ఎగ్జామ్‌ నిర్వహించలేదు.. రోడ్ మీదకు వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తోందన్నారు. 8 ఏళ్లుగా ఇళ్లు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు.. రైతులు రోడ్లపైకి వస్తున్నారు.. దళిత రైతులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? అని ప్రశ్నించిన భట్టి.. ప్రజల సమస్యలు తేల్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మరోవైపు కేంద్రం మీద పోరాటం చేయాల్సిందే.. మనకు కేంద్రం నుంచి రావాల్సినదానికోసం పోరాడాల్సిందే అన్నారు భట్టి… సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకుంటే… నువ్వు, నీ కుటుంబం, నీ అనుచరులు బాగు పడడానికి ఉపయోగపడిందని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించిన ఆయన.. తెలంగాణ అంటే నలుగురు కుటుంబ సభ్యులు కాదు, నలుగురు మంత్రులు కాదన్నారు.. ఇక, పీపుల్స్‌ మార్చ్‌తో ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క.