Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీని కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దీవించలేదు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల పక్షాన నిలబడటం వల్లే ప్రజలు స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇస్తున్నారు” అని ఆయన వివరించారు. ముఖ్యంగా 65 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ చేసిన “తోలు వలుస్తాం” అనే వ్యాఖ్యలను భట్టి తీవ్రంగా ఖండించారు. “తోలు తీసుకునే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు కేసీఆర్? పదిమందిని కూర్చోబెట్టుకొని తోలు వలుస్తానంటే ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడినా, మేము మాత్రం దిగజారి ప్రవర్తించము. మా అభివృద్ధి చాటల ద్వారానే మీకు సమాధానం చెబుతాం” అని భట్టి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభకు వచ్చే ధైర్యం లేకనే బయట ఉండి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
గతంలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా తేడా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా, పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని, అందుకు ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మద్దతు ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను ప్రజలు ఇచ్చారని, ఇప్పటికైనా కేసీఆర్ తన ధోరణి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి, విమర్శలకే పరిమితం కావడం ప్రతిపక్షాలకు తగదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Anantapur: కసాయి తండ్రి కిరాతకం.. ఇద్దరు కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేత.. చివరకు..?
