కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్‌కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చాడని, కోవిడ్‌తో ఎందరో మరణిస్తే ఏనాడు సీఎం బయటకు రాలేదన్నారు. నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని భయపడి జీవో తెచ్చారన్నారు.
ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో వందలమంది యువత బలిదానాలు చేసుకున్నారని, ఎదురొస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సుమన్ ఎవరి కోసం చేసుకున్నాడని ప్రశ్నించారు..? ఉద్యోగాలే రాని తెలంగాణ దేనికోసమో… ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ లాంటి మూర్ఖుడి మోసపు మాటలను ఈ మేధావులు ఎందుకు అంచనా వేయలేకపోయారు. మేధావులను కూడా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. సీఎం ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులపై ఎందుకంత కక్ష కట్టిండో అర్థం కావడం లేదన్నారు. ఆనాడు తన మాట వినకుండా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమాలు చేశారనే సాకుతో కక్షకట్టి వాళ్లను హింస పెడుతున్నారన్నారు.
టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 8 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు లెక్క చెప్పిండు. అయినా ఉద్యోగాలు ఇయ్యలేదని ఎద్దేవా చేశారు. సునీల్ నాయక్ చేసిన పాపమేంది? తెలంగాణ వచ్చినంక 600 మంది యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు చేసిన పాపమేంది అంటూ ప్రశ్నించారు. సీఎం మాత్రం ఎప్పుడు ఎన్నికలొచ్చినా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరిస్తూనే ఉన్నడు. 2014లో, 2018లో ఉద్యోగాలిస్తారనే ఆశతో నిరుద్యోగులు ఓట్లేశారని, ఈరోజు నిరుద్యోగులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. నేను స్వయంగా చూశానని బండి సంజయ్ అన్నారు. జనవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు.అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యేలు.. నిరుద్యోగుల తరపున అడుగడుగునా అడ్డుకుని తీరుతామన్నారు. నిరుద్యోగులు ఎవ్వరూ ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇదే చివరి ఉద్యమం కావాలి. టీఆర్ఎస్ ను తరిమికొట్టాలి. మీకు ఉద్యోగాలిచ్చే ప్రభుత్వం రావాలి. గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడాలి.
తెలంగాణలో నీళ్లు-నిధులు-నియామకాల కోసం ఉద్యమిస్తే… ఆ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ. ఆనాడు కేసీఆర్ యాడికి పోయిండు. పార్లమెంట్ లో ఓటేయకుండా సోయితప్పిన వ్యక్తి కేసీఆర్. విజయశాంతి సభలో గర్జించిందన్నారు.నాది దొంగ దీక్షట… నీ అయ్యది దొంగ దీక్ష. బాత్రూంలోకి పోయి ఇడ్లీలు తిన్న నీచపు బతుకు నీ అయ్యది.. తెలంగాణ గంగలో పడ్డా నాకక్కర్లేదు. నేను బతకుతను.. జ్యూస్ ఇవ్వమని తాగిన నీ అయ్యది దొంగ దీక్ష. ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా పోయి తాగి పండుకున్న చరిత్ర నీది. నీకు చిత్తశుద్ధి ఉంటే గుండెమీద ప్రమాణం చేసి 48 గంటలు దీక్ష చేసినని చెప్పగలవా?
ఉద్యోగల పరిస్థితి ఏంది? భార్య ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర.. తల్లిదండ్రులు మరో చోట ఉన్నరు. ఉద్యోగులు ఏడుస్తున్నరు . సీఎం దగ్గర మటన్, చికెన్ బిర్యానీలు తిన్న ఉద్యోగ సంఘాలు ఏమైనయ్? ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే పరిస్థితే లేదు. అయినా మీరెందుకు భయపడుతున్నరు? మీరు ఉద్యమం చేస్తేనే కదా… తెలంగాణ సాధించుకున్నది? అలాంటి మిమ్ముల్ని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు భయపడుతున్నరో అర్ధం కావడం లేదు. ఏ స్థానికత కోసమైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నరో ఆ తెలంగాణలోనే వాళ్ల స్థానికత ప్రశ్నార్థమైంది. వాళ్ల పిల్లలు, భావితరాల స్థానికత నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు.
