Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (సోమవారం) ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి దిమాపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బండి సంజయ్ కుమార్ అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నాగాలాండ్ రాజధాని కొహిమాకు వెళ్లారు. నేరుగా నాగాలాండ్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బండి సంజయ్ కుమార్ కు చీఫ్ సెక్రటరీ జాన్ ఎ ఆలంతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. 20 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ కనెక్టివిటీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. విద్య, వైద్య సౌకర్యాల విషయానికొస్తే…. రాష్ట్రంలో ఒకే మెడికల్ కాలేజీ ఉందని దీనిని ఎయిమ్స్ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగించాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎన్ఐటీ మినహా ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదని తెలిపారు. కొండ ప్రాంతాల మధ్యనున్న కొహిమా నుండి డిమాపూర్ వరకు ఉన్న రహదారికి ప్రత్యామ్నాంగా మరో రహదారి అవసరముందని అధికారులు ప్రతిపాదించారు. పీఎం విశ్వకర్మ పథకంపట్ల ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. స్కిల్ డెవలెప్ మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు.
Kamala harris: ప్రచారంలో కమల దుబారా ఖర్చులు! ఐస్‌క్రీమ్‌లకు, ఫుడ్‌కి ఎంతంటే..!
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ…ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్దిపట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిధుల వినియోగం, కార్యక్రమాల అమలు తీరుపై 15 రోజులకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో సమీక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే తాను వచ్చానన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలు ఖర్చు చేసే మొత్తం బడ్జెట్ లో 10 శాతం మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధికే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలు అభివ్రుద్ధి చెందాలన్నదే మోదీ అభిమతమన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా సేవలన్నీ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే కనీస మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి తేవడంతోపాటు మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి జల్ జీవన్ మిషన్ కింద తాగు నీటిని అందించాలని కోరారు.
వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఆయిల్ పాం’ పంటలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్ లో 11 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గతంలో 27వేల టన్నుల దిగుబడికే పరిమితం కాగా, ఈసారి 11 లక్షల 20 వేల టన్నుల ఆయిల్ పాం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆయిల్ పాం సాగు విషయంలో నాగాలాండ్ రైతుల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్, గతంలో పోలిస్తే ఏ మేరకు ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెరిగిందనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
అట్లాగే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం లో భాగంగా నాగాలాండ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆరా తీశారు. నాగాలాండ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ సంత్రుప్తికర స్థాయిలో (శాచ్యరేషన్) ప్రభుత్వ ఫలాలను అందించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ ఫలాలను క్షేత్రస్థాయిదాకా తీసుకెళ్లే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లోతుగా ఆరా తీయడంతోపాటు కేంద్రం నుండి ఏరకమైన సహాయ సహకారాలు స్థానిక ప్రజలు ఆశిస్తున్నారనే అంశంపైనా ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం సంపూర్ణతా అభియాన్ లో భాగంగా నాగాలాండ్ లో ఎంపిక చేసిన ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో కొనసాగుతున్న కార్యక్రమాల అమలు తీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. మొత్తం 15 శాఖలకు సంబంధించి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ… 3 శాఖల్లో మినహా ఇతర విభాగాల్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, దీంతో గర్భిణీలు, విద్యార్ధులు తీవ్ర అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు పేర్కొన్న విషయాలన్నీ నోట్ చేసుకున్న కేంద్ర మంత్రి త్వరలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు నివేదించి తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాగాలాండ్ హోం కమిషనర్ ఆర్. వ్యాసన్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ ఐఏఎస్ పాల్గొని కేంద్ర పథకాల అమలు తీరుపై అధికారుల నుండి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రేపు నాగాలాండ్ లోని వెనుకబడిన ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించి అధికారులు, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
Ram Charan In Kadapa: కడపలో కట్టలు తెంచుకున్న ‘మెగా’ అభిమానం