2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సీఎం తీరును ఎక్కడికక్కడ ఎండగట్టండి. జూన్ 23 నుండి మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ పోయి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. అబద్దాలను నిజాలుగా వల్లించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అసలు ఆత్మహత్యలే చేసుకోవడం లేదని, రాష్ట్రమంతా ఏ సమస్యా లేకుండా ప్రశాంతంగా ఉందన్నట్లుగా వక్రభాష్యం చెబుతున్నాడన్నారు.
ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలు, రాష్ట్ర నాయకులంతా ఎక్కడికక్కడ సీఎం తీరును ఎండగట్టాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. రాష్ట్రంలో ఇటీవల రాష్ట్రంలో మూడు బహిరంగ సభలు జరిగాయని అందులో టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలు ప్రధానమైనవి. ఈ మూడు సభలను చూసిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు.
ఇటీవల మూడు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే ఇదే విషయం వెల్లడైంది. ఆ నివేదికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉందని, బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగినట్లు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు తక్కువ ధరకు పెట్రోలు, డీజిల్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు మరింత యాక్టివ్ గా పనిచేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు బండి సంజయ్.
ఈనెలాఖరు నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 30 నుండి జూన్ 14 వరకు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు సుపరిపాలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ వెళ్లి మోదీ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలతోపాటు అవినీతి, అక్రమాలకు తావులేకుండా సుపరిపాలన అందించిన తీరు, భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని వివరించాలన్నారు.
