కేంద్రం విడుదలచేసే నిధులు అందరికీ అందేలా కృషిచేస్తానన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల లెక్క తేలుస్తానన్నారు. ఉపాధి నిధులను ఆపుతోంది కేసీఆరే. అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని మోడీ దృష్టికి తీసుకెళ్తా. ఉపాధి కూలీ బకాయిలన్నీ ఇప్పిస్తానన్నారు. ఉపాధి హామీ కూలీలతో బండి సంజయ్ ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 19వ రోజు కొనసాగుతోంది. ధన్వాడ మండలం మణిపూర్ తండాలో బండి సంజయ్ ను కలిశారు దాదాపు 300 మంది ఉపాధిహామీ కూలీలు. బండి సంజయ్ తో తమ సమస్యలు చెప్పుకున్నారు ఉపాధిహామీ కూలీలు. ఉపాధిహామీ కూలీలతో మమేకమై… వారితో నేల మీదే కూర్చోని, వారి సమస్యలు సావధానంగా విన్నారు బండి సంజయ్. తమకు అదనంగా కనీసం 50 రోజుల పనిదినాలు అయినా పెంచాలని కోరారు ఉపాధిహామీ కూలీలు.
పులులున్నా గుట్టలలో పనికోసం వెళ్తున్నాం. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నాం. మేము పనిచేస్తేనే ఉపాధి, బతుకగలుగుదాం. ప్రస్తుతం మాకు రోజూ కూలీ రూ. 257+20 ఇస్తున్నారు. మాకు ధన్వాడ లో పని దొరకడం లేదు… కావునా మాకు రోజు కూలీ అదనంగా కనీసం రూ.250 అయినా పెంచాలన్నారు. గత 3 నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం తమకు కూలీ డబ్బులు ఇవ్వలేదన్నారు కూలీలు.
100 రోజుల పని దినాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధిహామీ పథకం కూలీ డబ్బులను కేంద్రం ప్రతి నెల వారానికి ఒకసారి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తోంది. వారానికి ఒకసారి మీ అకౌంట్ లలో డబ్బులు పడాలి. ఎండాకాలం అదనంగా రూ.20 కూలీ కేంద్రం ఇస్తోంది. మోదీ మీ పైసలు ఆపే పరిస్థితి లేదు… ఇక్కడ ఆపేది కేసీఆర్ ప్రభుత్వమే. మీకు అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని మోదీని కోరుతాం. కేంద్రం రాష్ట్రానికి ఉపాధిహామీ కూలీ డబ్బులు ఇస్తుంటే… ఆ కూలీ డబ్బులను మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది కేసీఆర్ సర్కార్ అని మండిపడ్డారు బండి సంజయ్.
కేసీఆర్ మాటలతో వినడు… కొట్లాడితేనే వింటాడు. వారానికి ఒకసారి మీ కూలీడబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. రేపే మొత్తం లెక్కలు తెప్పిస్తా… మీకు అన్యాయం చేసిన వాళ్ళ లెక్క చూస్తా…కేసులు పెట్టిస్తా…వాళ్ళను జైలుకి పంపిస్తా. మీరు జాగ్రత్తగా పని చేసుకోండి. మోదీ మీకోసం లక్షా 40వేల ఇండ్లు మంజూరు చేశారు. అయినా కేసీఆర్ ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. పెన్షన్స్ ఇవ్వడం లేదు. 5 కిలోల బియ్యం ఫ్రీగా మోదీ ఇస్తున్నారు… మీరు కిలోకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు… మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే గల్లా పట్టి నిలదీయండి అన్నారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ దిట్ట. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం మేము రాలేదు… మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చాం. మోదీ ఇచ్చే పైసలు న్యాయంగా మీకు చేరేలా చేయడమే మా ధ్యేయం. ఇక బాంఛన్ బతుకులు వద్దు అన్నారు బండి సంజయ్.