Bandi Sanjay Counter To KCR Comments Over Religious Conflicts In Telangana: రంగారెడ్డి జిల్లాలోని కొత్త కలెక్టరేట్ ప్రారంభం కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీపై చేసిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, దుర్మార్గపు పనులతో బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలకు రెచ్చగొడుతోంది టీఆర్ఎస్ పార్టీ అని, కానీ ఆ ఆరోపణలు తమ బీజేపీ మీద వేయాలని కేసీఆర్ కుటుంబం చూస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో ఎక్కడా మత ఘర్షణలు లేవన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులకు మీరే కారణమంటూ కేసీఆర్‌ను దుయ్యబట్టారు. మునవ్వర్ ఫారూఖీ ఏమైనా దేశభక్తుడా? అతనితో షో ఎందుకు నిర్వహించావ్? అంటూ ప్రశ్నించారు. రాముడు, సీతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడ్ని అనేక రాష్ట్రాల్లో బహిష్కరించారన్నారు.
కేసీఆర్‌ను చూస్తే మునవ్వర్ ఫారూఖీలానే అనిపిస్తోందని.. లిక్కర్ స్కామ్‌ని డైవర్ట్ చేసేందుకు, ప్లాన్ ప్రకారమే అతడ్ని తీసుకొచ్చారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తాము మంత గురించి చర్చకు రామని, అభివృద్ధిపై చర్చకు మాత్రమే వస్తామని చెప్పామన్నారు. ఏ కంపెనీపై ఈడీ దాడి చేసినా.. కేసీఆర్ కుటుంబం పేరే వస్తోందని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు వల్లే.. ఘర్షణలు మొదలుపెట్టారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లాభపడటానికి.. కుట్ర చేసి తమ మీద నెట్టాలని చూస్తున్నారన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవించే పార్టీ అని.. మేధావులు, కళాకారులు పిడికిలి బిగించి రెడీగానే ఉన్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ఇలాగే మత ఘర్షణలు చేసేదన్నారు. అభివృద్ధి గురించి ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి మాట్లాడాలన్నారు. రైతుల్లో మంటలు కేసీఆర్ వల్లే కాలుతున్నాయని.. ‘వరి వేస్తే ఉరే’ అని చెప్పినందుకు దుబ్బాక, హుజురాబాద్‌లలో ప్రజలు దెబ్బ కొట్టారన్నారు. లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు కేసీఆర్‌ను జనాలు నమ్మారని, కానీ ఇప్పుడు నమ్మట్లేదని బండి సంజయ్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డికి మోడీ శాపమా? అని ప్రశ్నించినా ఆయన.. అక్కడ ఎంత మందికి పెన్షన్‌లు, డబుల్ బెడ్రూమ్‌లు ఇచ్చావో చెప్పాలని నిలదీశారు. కేంద్రం ఏమిచ్చిందో తాము యాత్రలో అక్కడి వాళ్లకి వివరిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల జాబితాపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో ఇతర పార్టీల వారిని కేసీఆర్ చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ విభజన సమయంలోనే మెట్టమొదట ద్రోహం చేసింది కేసీఆరేనని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి 575 టీఎంసీలు రావాలని.. కానీ అప్పుడున్న సీఎంతో కుమ్మక్కై 299 టిఎంసీలకు సంతకం పెట్టారని వెల్లడించారు. రావాల్సిన వాటిపై పోరాడవు, వచ్చే వాటిని వాడుకోవు అంటూ కేసీఆర్‌ని నిలదీశారు. అనేక ప్రాంతాలు ఎడారిగా మారాయంటే.. అందుకు కారణం కేసీఆరే అన్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం కోసం.. దొంగ కేసులు పెట్టి, దాడులు చేయించి అరెస్ట్ చేశారని బండి సంజయ్ చెప్పారు. తమకొస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ యాత్రను అడ్డుకునేందుకు కుట్ర పన్నిందని అన్నారు. తాము చట్టం, న్యాయం మీద విశ్వాసంతో ఉన్నామని.. ఎట్టకేలకు ధర్మమే గెలిచిందని అన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, యాత్ర మళ్లీ మొదలుపెడతామని బండి సంజయ్ వెల్లడించారు.