NTV Telugu Site icon

Bandi Sanjay: రాష్ట్రంలో రాక్షస, నయా నిజాం పాలన కొనసాగుతోంది.

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని.. బీజేపీ ఒత్తడితోనే విద్యాశాఖలో తెచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని వెల్లడించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కేసీఆర్ ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చి నెలకు రూ. 15 లక్షల జీతం ఇస్తున్నారని.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక దరిద్రపు స్ట్రాటజీ టీమ్ ను పెట్టుకుని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని..టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల తిరస్కరణకు గురైందన్నారు. మాఫియాకు అడ్డాగా హైదరాబాద్ మారడంతో రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే భయపడాల్సి వస్తోందని.. మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు బండి సంజయ్.

సీఎం కళ్లు మూసుకుని ఉన్నారని.. దీంతో సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ బేరీజు వేసుకోవాలని సూచించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని.. మోదీకి మంచి పేరు రాకుండా ఉండేందుకు కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పాలన కోసం బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని కోరారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో తీసేసిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రైవేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రైవేట్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.