HYDRA : పాతబస్తీకి తలమానికంగా నిలిచే చారిత్రక బమృక్‌నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతూ ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ఈ చెరువును ప్రజలకు అర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఆక్రమణలతో నాశనం అయిన ఈ చెరువు, హైడ్రా చేపట్టిన సమగ్ర అభివృద్ధి చర్యలతో మళ్లీ తన పాత ఔన్నత్యాన్ని తిరిగి పొందుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
చెరువు చుట్టూ నిర్మిస్తున్న బండ్, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సహా కీలక నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మూడు వైపులా రూపొందిస్తున్న కొత్త ప్రవేశ మార్గాలు స్థానికులకు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. చెరువు పరిసరాలలో ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేలా నిర్మిస్తున్న గజబోలు, ప్రవేశ ద్వారాలు ఇస్లామ్ శైలి నిర్మాణ కళను ప్రతిబింబించేలా వేయాలని సూచించారు.
చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పిల్లల ప్లే ఏరియాలు, వృద్ధుల సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్‌లు, పార్కులు వంటి ప్రజా సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న సీసీటీవీ కెమెరాలను హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి నిరంతరం మానిటర్ చేసే విధంగా సాంకేతిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఒకప్పుడు ఆక్రమణలతో కేవలం 4.12 ఎకరాలకు మాత్రమే పరిమితమైన బమృక్‌నుద్దౌలా చెరువును, హైడ్రా చొరవతో తిరిగి 18 ఎకరాలకు విస్తరించినట్లు రంగనాథ్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆక్రమణలను తొలగించిన తర్వాత చేపట్టిన ఈ అభివృద్ధి చర్యలతో వరద నియంత్రణకు తోడ్పడటమే కాకుండా భూగర్భ జలాల పెరుగుదలకూ ఇది దోహదం చేస్తుందని చెప్పారు.
1770లో నిజాం ప్రధాని నవాబ్ రుక్న్‌ఉద్దౌలా నిర్మించిన ఈ చెరువు అతి విశిష్టమైన చరిత్రను కలిగి ఉంది. ఈ చెరువులోని నీటిని ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల తయారీకి, ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ చెరువు పునరుద్ధరణతో మళ్లీ సందడి సంతరించుకుంటుండటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీ అభివృద్ధికి ఇది పెద్ద అడుగని, రాష్ట్ర ప్రభుత్వం మరియు హైడ్రా అధికారుల కృషిని వారు అభినందిస్తున్నారు.
Rahul Gandhi: ‘‘కుక్క వివాదం’’.. రేణుకా చౌదరికి మద్దతుగా రాహుల్ అనుచిత వ్యాఖ్యలు..