Bairi Naresh arrested: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కోడంగల్ లో అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది. గత మూడు రోజులుగా నరేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేసి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ధృవీకరించారు. కాసేపట్లో బైరి నరేష్ ను కోడంగల్ తరలించనున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నరేష్ ఎక్కడున్నాడనే వివరాలను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు అయినా తన వ్యాఖ్యలు సమర్థించుకుంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియో పోస్ట్ చేశాడు.
Read Also: Bairi Naresh: బైరి నరేష్ కోసం పోలీసులు వేట.. పీడీయాక్ట్ పెట్టాలంటున్న ఎమ్మెల్యే..
బైరి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు, అయ్యప్ప మాలాధారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోస్గిలో అయ్యప్ప స్వాములు బైరి నరేష్ ను ఉరికించి కొట్టారు. శనివారం కూడా బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప స్వాములు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే నరేష్ ను అరెస్ట్ చేశామని.. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బైరినరేష్ పై పీడీయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదు అయ్యాయి. కోడంగల్ లో 4 సెక్షన్లపై కేసులు నమోదు అయ్యాయి. సాయంత్రం లోగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.