మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆదివారం రెడ్డి ఘర్జణ సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని అడ్డుకోవడంతో పాటు ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై తాజాగా టీఆర్ఎస్ నేతలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు అయింది. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 173, 147,149,341, 352, 506 కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ నేతలు సోమశేఖర్ రెడ్డి, హరివర్థన్ రెడ్డిపై కేసులు పెట్టారు.
కొంత మంది పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని.. దీని వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆయన టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ కేసు పెట్టారు. కాంగ్రెస్ నేతల కుట్రలో భాగంగానే మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిందని.. సభ నుంచి వెళ్లిపోతున్న సమయంలో మల్లారెడ్డిపై వాటర్ బాటిళ్లు, కుర్చీలతో కొంతమంది దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రెడ్డి సభలో కాంగ్రెస్ నేతలు ప్లెక్సీలు పెట్టి, ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది ఆకతాయిలను తీసుకువచ్చి దాడి చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే తనపై దాడి చేసింది చంపడానికే అంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. వంద మందిని పంపి నన్ను హత్య చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఆయన బాగోతాలు బయటపెట్టినందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. నాపై దాడి చేసిన వారిని జైలుకు పంపిస్తామని అన్నారు.