మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో.. ప్రతి ఊరుని అభివృద్ధి చేశామని చెప్పినప్పుడు.. సభలో వ్యతిరేక నినాదాలు రేకెత్తాయి. అంతేకాదు.. తన ప్రసంగం ముగించుకొని మంత్రి వెళ్తున్న క్రమంలో వాహనంపై దాడి చేశారు. కుర్చీలు, రాళ్ళు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అంతకుముందుకు సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తూ.. తన నియోజకవర్గంలో రెడ్డి సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తమకు రెడ్డి కార్పొరేషన్ కావాలన్న ఆయన.. గతంలో నుంచి తాను కూడా రెడ్డి సంఘాల్లో ఉన్నానన్నారు. రెడ్డి సంఘాలు, భవనాలు కడుతున్నామని.. రెడ్లు దయ ఉన్న మంచి మనుషులని.. రెడ్లు ఇచ్చే రకం కానీ తీసుకునే రకం కాదన్నారు. స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి కూడా రెడ్ల కోసం పోరాడాడు అని గుర్తు చేసుకున్నారు.
ప్రతి ఊర్లల్లో రెడ్డి భవనాలు ఉన్నాయని, అయితే అవి యాభై ఏళ్ళ క్రితం నాటివి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని మల్లారెడ్డి అన్నారు. రెడ్లలో చాలా సంఘాలున్నాయని.. రెడ్లందరూ ఐక్యంగా ఉండి, రెడ్డి భవనాలు ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో రెడ్లు లేని ఊరు లేదని, తనలాంటి డబ్బున్న వాళ్ళందరూ కలిసి రెడ్ల అభివృద్ధికి పాటుపడదామని మల్లారెడ్డి కోరారు.