వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్‌ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. టీఆర్‌ఎస్ నేత తనతో అసభ్యంగా ఏం మాట్లాడలేదని.. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం సాధరణమేనన్నారు. దీనిపై తానేమీ కేంద్రానికి కంప్లైంట్ చేయడం లేదన్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
Read Also: Ffreedom app: ‘ఫ్రీడమ్ నెస్ట్’లోకి 28 మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలు..
మరోవైపు.. అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు.. సీఎం హిమంత బిస్వా శర్మకు భద్రత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, సీఎం భద్రత లోపానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా అసోం డీజీపీ.. తెలంగాణ పోలీస్ బాస్‌ను కోరినట్టుగా ప్రచారం జరిగింది.. దీనిపై తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.. అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత.. తెలంగాణ డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్బంగా సీఎం హిమంతకు జరిగిన ఉదంతంపై వాకబు చేశారు. అంతేగాని, అసోం సీఎం భద్రతకు బాధ్యులైన సంబంధిత టీఎస్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదని డీజీపీ కార్యాలయం సీపీఆర్‌వో ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
