వెన్నెముక, వెన్ను సమస్యలపై అవగాహన పెంచేందుకు ఏషియన్ స్పైన్ హాస్పిటల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ (NGO), నానో హెల్త్ కలిసి పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించాయి. ఈ మేరకు ‘హెల్తీ స్పైన్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ నుంచి ‘వాక్ ఫర్ హెల్తీ స్పైన్’ వాక్‌థాన్‌ను నిర్వాహకులు చేపట్టారు. ఈ వాక్‌థాన్‌కు హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు (జలమండలి) ఎండీ దానకిషోర్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ వహీద్, బ్రాడ్రిడ్జ్ ఛైర్మన్ వి.లక్ష్మీకాంత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఛైర్మన్, ఎండీ డా.సుకుమార్ సూరా, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈవోచ డైరెక్టర్ నరేష్ కుమార్ పగిడిమర్రి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాల, నానో హెల్త్ సీఈవో మనీష్ రంజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. ఈ వాకథాన్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెన్నుముక ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లక్షణాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటే శస్త్రచికిత్స చేయవలసిన అవసరాన్ని నిరోధించవచ్చని అభిప్రాయపడ్డారు. నివారణ ఆరోగ్య సంరక్షణలో అన్నింటిలో ఉత్తమమైందన్నారు. సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని దానకిషోర్ పేర్కొన్నారు.
ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ఛైర్మన్, ఎండీ డా.సుకుమార్ సురా మాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమమైందన్నారు. వెన్నెముక సమస్యలు ఎవరికైనా రావచ్చని.. దీని గురించి అవగాహనను వ్యాప్తి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు . ఈ కార్యక్రమం లక్ష్యం ప్రజలకు వెన్నెముక సమస్యలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని.. వారి సమస్యలను పరిష్కరించే మార్గాలు ఉన్నాయని తెలియజేయడమే అని తెలిపారు. వెన్నెముక సమస్యలను నివారించడానికి మీరు చేయగలిగిన ఉత్తమమైన పని ఏమిటంటే శారీరకంగా చురుకుగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేలా చూసుకోవడం, సరైన భంగిమను అలవర్చుకోవడం,, మీ శారీరక సామర్థ్యాలకు సరిపడని బరువులు ఎత్తకుండా ఉండటం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమేనని సూచించారు.