శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. బాలాలయం వద్ద భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులకు సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తెల్లవారుజామున 4 గంటలకు బాలాలయంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఆర్జిత సేవలు నిర్వహించారు. బాలాలయంలో ఆలయ అర్చకులు నిజాభిషేకం, సుదర్శన మహా హోమం నిర్వహించారు.
గుట్టపైన ఉన్న పాత గోశాలలోని వ్రత మండపంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన తోరణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా వ్యక్తిగత వాహనాలను ఆలయ భద్రతా సిబ్బంది కొండ గుడిపైకి అనుమతించలేదు. కాగా క్రిస్మస్ కావడం, వీకెండ్ కావడంతో రెండు రోజులు సెలవులు రావడంతో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.