NTV Telugu Site icon

Gundala Villagers Demand: మమ్మల్ని తెలంగాణలో కలపండి.. గుండాల వాసుల వేడుకోలు

Gundala 1

Gundala 1

వరద ప్రభావంతో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వివిధ గ్రామాల వాసులు తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తెలంగాణ సహకారం లేకపోతే మా ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని గుండాల వాసులు అంటున్నారు. గ్రామంలోకి ఇంకా చేరుకొని ప్రజలు పశువులన్నీ కొట్టుకొని పోయాయని ఆవేదన చెందుతున్నారు. గుండాల గ్రామం భద్రాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కానీ అది ఏపీలో అంతర్భాగం. గోదావరికి కొద్దిగా వరద వచ్చిన గ్రామం చుట్టూ నీళ్లు చేరుకుంటాయి. నిన్న మొన్న వచ్చిన వరదలకు గ్రామంలో చిక్కుకున్న ప్రజలను తెలంగాణ అధికారులు రక్షించారు. ఇంకా గ్రామంలోకి వెళ్లడానికి ప్రజలకి ధైర్యం చాలటం లేదు. గ్రామంలో వందలాది పశువులు చనిపోయాయి.

భద్రాచలంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. దీనికి ఉష్ణ గుండం అని కూడా పేరు. ఆనాడు సీతమ్మ ఇక్కడే స్నానమాచరించడంతో దానికి ఆ పేరు వచ్చిందంటారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా ,రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. గోదావరికి రెండవ ప్రమాద హెచ్చరిక దాటిన వద్ద నుంచి ఈ గ్రామంలో భయాందోళనలు మొదలవుతాయి .ఈ గ్రామం చుట్టూ నీళ్ళు చేరుకుంటాయి. తెలంగాణ ప్రాంతం తమలో కలపాలని కోరుతున్న ఒక గ్రామంలో ఇది ఒక గ్రామం .పిచ్చుకలపాడు, ఎటపాక, పురుషోత్తమ పట్నం ,గుండాల కన్నాయిగూడ ఈ గ్రామాన్ని తెలంగాణలో కలపాలని ప్రజలు కోరుతున్నారు.

అయితే ఇందులో పురుషోత్తమ పట్నం గ్రామం మాత్రం ఆంధ్రాలోనే ఉండటానికి అంగీకారం తెలుపుతోంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం చెందిన భూములను పురుషోత్తం పట్నం గ్రామస్తులు పలువురు ఆక్రమించుకున్నారు. ఆక్రమణదారులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల అండదండలు ఉన్నాయి. దీంతో తాము ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. మిగిలిన నాలుగు గ్రామాలు ప్రజలు మాత్రం తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. మిగిలిన నాలుగు గ్రామాలు పెద్దగా ముంపునకు గురికాక పోయినప్పటికీ గుండాల గ్రామం మాత్రం పూర్తిగా ముంపుకి గురవుతుంది.

గ్రామం చుట్టూ నీళ్లు వచ్చాయి. చుట్టే కాదు గ్రామం మీద నుంచి నీళ్ళు ప్రవహించాయి. ఈ గ్రామంలో కనిపిస్తున్న తాడిచెట్ల పైనుంచి నీళ్లు ప్రవహించాయి. అయితే ఎటువంటి ముందస్తు హెచ్చరికలను ఆంధ్ర అధికారులు చేయలేకపోయారు. అధికారుల హెచ్చరికలు సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామస్తులు సామాన్లు సర్దుకోలేకపోయారు. ఒక్కసారిగా వరదరావడంతో గ్రామాన్ని చుట్టుముట్టటంతో పిల్లాపాపలతో అందరూ గ్రామంలో ఉన్న ఒకటి రెండు డాబాల మీదికి ఎక్కారు. ఆ డాబాల మీదనే భయంగా ఒక్క రోజంతా ఉండిపోయారు. ఇక పోతే వరద తీవ్రత ఎక్కువ కావడంతో డాబాలు కూడా కూలిపోతాయని అనిపించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అధికారులకి ఎంత మొత్తుకున్నప్పటికీ అక్కడివారు స్పందించలేదు.

ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం గుండాల గ్రామానికి 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నుంచి ఇక్కడికి అధికారులు రావడం పెద్ద సమస్యగా మారింది. దీంతో వారెవరు ఇటువైపు చూడటం లేదు. లాంచీ లను కూడా సిద్ధం చేయలేదు. ఈ గ్రామంలో ఉన్నవారికి బంధుత్వం అంతా భద్రాచలంలోనే ఉంటుంది. సమయంలో వీరి రోదనను ఎన్టీవీ భద్రాద్రి జిల్లా ఉన్నతాధికారులకు అందించింది.

గ్రామస్తులు పలువురు తమని రక్షించమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెమ్ వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే పోదెం వీరయ్య పలుమార్లు జిల్లా కలెక్టర్ ఎస్పీకి సమాచారం అందించారు. భద్రాద్రి జిల్లా యంత్రాంగం ఆంధ్ర ప్రదేశ్ యంత్రాంగంతో సంప్రదించి రెండు లాంచీలను గ్రామానికి పంపించి గ్రామంలో చిక్కుకునిపోయిన 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఎమ్మెల్యే సహకారంతో మేము మా ప్రాణాలతో బయటపడ్డామని అంటున్నారు. మాకు చాలా ప్రమాదకరంగా ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని తెలంగాణ ప్రాంతంలో కలపమని కోరుతున్నారు. తమకి ఎప్పటికైనా ప్రమాదం ఉందని ఈ వరద గతంలో ఎన్నడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. తమ పశువులు పూర్తిగా కొట్టుకొని పోయాయని గ్రామంలో ఉన్న ఇళ్ళు అన్ని సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్యాకేజీ ఇచ్చి బయటికి పంపించాలని కోరుతున్నారు.
(ఖమ్మం ప్రతినిధి భూపాల్ మామిడాల సహకారంతో…)

Karnataka Ambulance Crash: ఘోర అంబులెన్స్ ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్

Show comments