మునుగోడులో బీజేపీ నిర్వహించే బహిరంగ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 21న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవుతారని, ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలిపారు. మునుగోడు సభను అమిత్ షా హాజరుకు వీలుగా ఉండేలా నిర్వహిస్తున్నామని, అందుకు ఆయనకు ఆగస్టు 21తో పాటు 29వ తేదీని కూడా సూచించినట్లు చెప్పారు. చివరగా 21నే సభ ఖరారైందని వివరించారు బండి సంజయ్.. మరోవైపు, తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు బైపోల్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ చేరికల కమిటీ నియోజకవర్గంలో యాక్టివ్ అయింది. టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also: RSS: ప్రొఫైల్ పిక్చర్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
మునుగోడు ఉప ఎన్నికకు ఒక వ్యుహం ప్రకారం కార్యాచరణతో బీజేపీ ముందుకెళ్తోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, అది ఆమోదించే నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర మునుగోడుకు చేరుకునేలా ప్లాన్ చేశారు. ఆ నియోజవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో సభ నిర్వహించారు. అమిత్ షా నుంచి బండి సంజయ్ వరకు ఇప్పుడు అందరూ దృష్టి మునుగోడు పైనే కేంద్రీకరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్, చండూర్, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాలు కాగా.. చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మునుగోడు ఉపఎన్నికను కేంద్రపార్టీ నేరుగా పర్యవేక్షించనుంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో పాదయాత్రతో రంగంలోకి దిగారు. ఈనెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ నిర్వహించబోతున్నారు. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , సీఎం కేసీఆర్ బహిరంగ సభలు వరుస రోజుల్లో జరుతుండటం మునుగోడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.