మునుగోడు ఉప ఎన్నికలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. అధికార టీఆర్‌ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈనేపథ్యంలో.. అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. దీంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే.. ఇప్పటికే మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జులు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ మునుగోడులో జరిగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ మేరకు హాజరవుతారోననే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ఇక మరోవైపు టిక్కెట్ ఆశావహులు కొన్నాళ్ల నుంచే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు. దీంతో.. పార్టీ టిక్కెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే పీసీసీ సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీకి నివేదించింది. ఈనేపథ్యంలో.. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశముందని మాజీ మంత్రి ఒకరు వెల్లడించారు.
Jagadish Reddy: మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే.. కాషాయం కనుచూపు మేరలో లేదు