Site icon NTV Telugu

Honour Killing: పరువు హత్యపై ఒవైసీ రియాక్షన్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

స‌రూర్ న‌గ‌ర్ ప‌రువు హ‌త్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని ఒవైసీ అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా… ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Gas price hike: వంటింట్లో మంట.. భారీగా పెరిగిన గ్యాస్‌ ధర

సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని… తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. కాగా, దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ… సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మతాంతర వివాహం వల్లే నాగరాజును హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో… హత్యకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఒవైసీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, సరూర్ నగర్‌లో బిల్లపురం నాగరాజు పరువు హత్యపై గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసలు జారీ చేసింది.

Exit mobile version