ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు.
గెలిపించిన ఖర్మకి అనుభవిస్తున్న నరకం ఎప్పుడు పోతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..టీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు. ఇక నేను గెలవలేననే భయంతో ఎక్కడో బీహార్ లో ఉన్న పీకే లాంటి వారిని తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను గోల్ మాల్ చేసి దోపిడీ చేసేందుకు పీకేలాంటి వారు పనిచేస్తారని అన్నారు. రూ.600 కోట్ల కాంట్రాక్ట్ తో పీకే పనిచేస్తున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో నన్ను ఓడగొట్టేందుకు జిల్లా మంత్రి హరీష్ రావు పని చేసిండని ఆరోపించారు. పీకే సర్వేలు తెలంగాణలో పనిచేయవని ఆయన అన్నారు. రైతులకు ఏక కాలంలో రూ. లక్ష రుణమాఫీ చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లిండని విమర్శించారు. తెలంగాణలో ఒక్కో వ్యక్తిపై రూ. 1.25 లక్షల అప్పు ఉందని.. కాదని చెప్పమనండి నేను చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. మద్యం ద్వారా రూ. 40 వేల కోట్లు ఆదాయం వస్తుందని.. తెలంగాణ తాగుడుకు బానిస అయిందని అన్నారు ఈటెల రాజేందర్.
గుడుల పక్కన, స్కూల్స్ పక్కన మద్యం దుకాణాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నష్టపరిహారం ఇవ్వమన్న గౌరవెల్లి రైతులపై లాఠీఛార్జి చేయించారని, డబ్బులు తీసుకోండి, దావతులు చేసుకోండి కానీ టీఆర్ఎస్ కు ఓటేయకండి అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ విశ్వనీయత కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వెళ్లినట్లే అంటూ ఆయన విమర్శించారు.