ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ బాటిల్ తలపై మోదుకుంటూ మరీ బెదిరింపులకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడుకి గజ్వెల్ కు చెందిన (20) ఏళ్ల యువతీ ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయింది. అయితే ఈ పరిచయం కాస్త..వారి ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. తాజాగా రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని యువతిని ఏకంగా తన ఇంటికే తీసుకువచ్చాడు. దీంతో యువకుడు కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద రచ్చ జరిగింది. చివరికి ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే ఆ యువతి తనకి దక్కదేమో అనే అనుమానంతో.. వినోద్ మద్యం సేవిస్తూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం బాటిల్ తో రక్తం వచ్చేలా తలపై మోదుకుంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ యువకున్ని బుజ్జగించి వాటర్ ట్యాంక్ పై నుండి దించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.