తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు కొత్త విద్యాలయాలపై ఇటీవల కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. కానీ.. కేంద్రం మాత్రం 20 కేజీబీవీలను అంగీకరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిలో 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. వీటిని తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుపనున్నారు. అయితే.. శాశ్వత భవనాలు వస్తే మిగిలిన తరగతులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 208 చోట్ల ఇంటర్ వరకు విద్య అందిస్తుండగా మిగిలిన వాటిల్లో 6-10 తరగతుల వరకు భోదన అందిస్తున్నారు.