కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతుంటే.. కరోనాను కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో, కరోనా వాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టించి డబ్బులు దండుకుంటున్నారు. అయితే అలాంటి రెండు ముఠాల ఆటను సౌత్ జోన్ పోలీసులు కట్టించారు. ఈ సందర్బంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నకీలు ఆర్టీపీసీఆర్, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. రెండు గ్యాంగ్ లకు సంబంధించిన ఆరుగురిని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. మలక్ పేట్ లోని హోమ్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని లక్ష్మణ్ , ప్రభాత్ కుమార్ సంఘీ ఇద్దరు నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ తయారు చేస్తున్నారని గుర్తించామన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సెలవులు కోసం ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ అందజేస్తున్నారని, నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇచ్చేందుకు రెండు వేల నుండి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఆసీఫ్ నగర్ కి చెందిన ఇమేజ్ డయాగ్నిస్టిక్ సెంటర్ యజమాని త్తారీక్ హబీబ్.. విదేశాలకు వెళ్లే వారికోసం నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడని ,అఫ్జల్ సాగర్ ప్రాంతంలోనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ కుమారి నిందితులకు సహకరించిందని ఆయన తెలిపారు.