Site icon NTV Telugu

CM Chandrababu: పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పాలనకు నిజమైన అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ నిరంతరం పోరాటం చేశారని, పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అలాగే టీటీడీలో అన్నదాన పథకం ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలికిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని తెలిపారు.

AI టెక్నాలజీతో Samsung Vision AI 4K Ultra HD Smart QLED టీవీ.. రిపబ్లిక్ డే సేల్ లో రూ.38,000 భారీ డిస్కౌంట్..!

ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తోందని అన్నారు. ఇప్పటికే మూడు లక్షల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని, ఉగాది రోజున మరో ఐదు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ‘సూపర్‌ 6’ పథకాలను సూపర్ హిట్ చేశామని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పెన్షన్లు పెంచామని తెలిపారు.

మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని, పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. చదువుకున్న ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, గత పాలకులు పెట్టిన ఫోటోలు తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. భూ రికార్డుల భద్రత కోసం రీ-సర్వేను పక్కాగా నిర్వహిస్తూ, బ్లాక్‌చైన్, క్యూఆర్ కోడ్ విధానాలను అమలు చేస్తున్నామని, రికార్డులు ట్యాంపర్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గత పాలకులు ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారని, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగులను గౌరవిస్తూ బకాయిలు, డీఏలు చెల్లిస్తున్నామని, వారికి నిజమైన సంక్రాంతి అందించామని చెప్పారు. దేశంలో ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని, కోటి మంది కార్యకర్తలు, కోటి కుటుంబాలు పార్టీకి అండగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది తన అదృష్టమని అన్నారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, అయినా రాష్ట్రాభివృద్ధికే ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో తాను కన్వీనర్‌గా పనిచేశానని, వాజ్‌పేయ్ హయాంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సహకరించామని గుర్తుచేశారు.

OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని, తమవైపు నుంచి కూడా మోదీకి అదే స్థాయిలో సహకారం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలి, తెలుగుజాతి అన్నింటా ముందుండాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గొంతుమీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా.. జై టీడీపీ, జై సీబీఎన్ అని నినదించి కార్యకర్తలు టీడీపీకే సొంతం అని పేర్కొన్నారు. తన జీవితంలో తెలుగు ప్రజలకు, టీడీపీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నానని చంద్రబాబు భావోద్వేగంగా చెప్పారు. ప్రజలను నడిపించాలన్నా, విజయానికి దారి చూపాలన్నా కార్యకర్తలే ముందుండాలని, టీడీపీ కార్యకర్తల త్యాగాలు, కష్టార్జితమే తాను ముఖ్యమంత్రి కావడానికి కారణమని స్పష్టం చేశారు.

Exit mobile version