ఐఫోన్ ప్రియులకి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చేసింది. ఐఫోన్ 14 ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయం బయటకొచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన ఈ కొత్త ఫోన్ లాంచ్ కానుందని తెలిసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నట్టు సమాచారం. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్ ధర వంద డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ. 10,000 అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అధిక దిగుమతి సుంకం, జీఎస్టీ, ఇతర చార్జీలు కలుపుకుని… అమెరికన్ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.
అయితే.. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ సంస్థ స్వస్తి పలకనుంది. కారణం.. ఐఫోన్ 14 సిరీస్‌లో వస్తోన్న నాన్-ప్రో మోడల్స్, పూర్తిగా ఐపోన్ 13 ప్రో మోడల్స్‌ని పోలనున్నాయి. ఆ పాత మోడళ్ల ప్యాటెర్న్‌ని అనుసరించే కొత్త మోడల్స్‌ని నిర్మించారు. ఐఫోన్ 13 సిరీస్‌లోని ఏ15 బయోనిక్ చిప్‌తోనే కొత్త ఫోన్లను తయారు చేసినట్టు తేలింది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో మాత్రం బయోనిక్ ఏ16 చిప్‌ను యాపిల్ పొందుపరుస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ గురించి యాపిల్ సంస్థ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ.. సెప్టెంబర్ 13న రావడం మాత్రం తథ్యమని ‘టిప్‌స్టర్’ వెల్లడిస్తోంది. ఇదే సమయంలో యాపిల్ వాచ్ సిరీస్ 8 లాంచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మొబైళ్లు 6.1 ఇంచుల డిస్‌ప్లేతో కలిగి ఉండగా.. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్‌ప్లేతో రానున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కెమెరా మాడ్యూల్ కూడా పెద్దగా ఉండనుందట! ఈ కెమెరా సెటప్‌లో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంటుందని సమాచారం.