ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (ఇందులో అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులు కూడా ఉన్నారు) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు.