దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలంతా సమావేశం అయ్యారు. సోనియా, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, తదితరలు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది.