ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా గుర్లలో తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధి ప్రబలటానికి (Acute Diarrheal Disease-ADD) దారితీసిన కారణాలు, భవిష్యత్తులో అట్టి పరిస్థితిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదికను అందజేసింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మంగళవారం సాయంత్రం మంత్రిత్వ శాఖకు నివేదికను అందచేసింది.