NTV Telugu Site icon

KCR : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.?ఆ అవసరం తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందా.?

Sb

Sb

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత రసవత్తరంగా మారుతోంది. ఏపీలో అయితే ఏకంగా ఎన్నికల ముందు వినిపించే పొత్తుల గురించి.. ఇప్పుడే చర్చ మొదలైంది. పవన్‌ కళ్యాణ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయని చెప్పడంతో.. ఏపీ పాలిటిక్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. మహానాడు తర్వాత టీడీపీ కూడా తమ బలం పెరిగిందంటూ ప్రచారం చేసుకుంటోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఏపీలో రెండురోజులపాటు పర్యటించి.. కమలం పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా రుతుపవనాల సీజన్‌లో రాజకీయ మంటల్ని రాజేస్తున్నాయి. ఇదంతా ముందస్తు ఎన్నికలకు సన్నాహం అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నా.. అధికార పార్టీ మాత్రం అదేమీలేదు.. మాకు అంత అవసరం లేదు అని కొట్టిపారేస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ముందస్తుపై వైసీపీని కవ్విస్తున్నా.. అధికార పార్టీ మాత్రం తమ పని తాను చేసుకుంటూ ముందుకు పోతోంది.

ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్‌.. మరోసారి ముందుస్తు ఎన్నికల వ్యూహం అమలు చేస్తారని విపక్ష నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే కేసీఆర్‌.. ఈసారి కూడా అమలుచేసేందుకు స్కెచ్‌ వేస్తున్నారని.. అటు కాంగ్రెస్‌.. ఇటు బీజేపీ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ.. మూడు పార్టీలు మంచి ఊపు మీద ఉన్నాయి.

రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని, ఇక్కడ జరిగే ప్రతి ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల నుంచి జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు వరకు అన్నింటినీ.. రాజకీయ వస్తువులుగా మార్చేశాయి. తెలంగాణపై తాము ప్రత్యేకంగా ఫోకస్‌ చేశామని చెప్పేందుకు బీజేపీ.. అనేక ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని ఇక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. GHMC బీజేపీ కార్పోరేటర్లతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై.. రాజకీయ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలు కూడా చేశారు. ఇక కాంగ్రెస్‌ కూడా ఎక్కడా తగ్గడంలేదు. ఏకంగా రాహుల్‌ గాంధీతో వరంగల్లో రైతు సంఘర్షణ సభ నిర్వహించారు. రైతుల కోసం డిక్లరేషన్‌ ప్రకటించి.. ఆ విధంగా ముందుకు పోతామని ప్రకటించారు. చింతన్‌ శిబిర్‌లతో కేడర్‌ను తిరిగి యాక్టివ్‌ చేయడంతో పాటు ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో హస్తం నేతలు వివరించి చెబుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జాతీయ అజెండా పేరుతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతూ.. మంతనాలు జరుపుతున్నారు. రెండు,మూడు నెలల్లో జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఉంటుందంటూ హింట్‌ కూడా ఇచ్చారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది సస్పెన్స్‌గా మారింది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై కాన్‌సన్‌ట్రేట్‌ చేయడంతో.. ఆయన మళ్లీ ముందస్తుకు వెళ్తారనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి విపక్షాలు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించిన ప్రగతిని.. టీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించినట్లే.. దేశ అభివృద్ధిలో కూడా కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారన్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు చూస్తుండటంతో.. ఇక్కడ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష నేతలు పదే పదే చెబుతున్నారు. అందుకు టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న తీరునే ఉదాహరణగా చూపుతున్నారు. సంస్థాగత కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్‌, బీజేపీనేతలు. దీంతో తెలంగాణలో రాజకీయాలు.. గత కొద్దిరోజులుగా వాడీవేడీగా సాగుతున్నాయి.

మామూలుగా ఎన్నికలు జరిగే ఏడాదిని ఎలక్షన్‌ ఇయర్‌ అని అంటుంటారు. ఆ ఏడాదిలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం.. వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అనేక వరాలను ప్రజలపై కురిపిస్తుంటాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటుంటాయి. ఇటు ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తాయో వివరించడంతో పాటు ఎన్నికలకు వెళ్లేందుకు సంస్థాగతంగా బలం పెంచుకుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా అప్పుడే మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం ఉన్నా.. రాజకీయ హడావుడి మాత్రం ముందే మొదలైంది. అటు అధికారంలో ఉన్న పార్టీలు.. ఇటు ప్రతిపక్షాలు.. అన్నీ కూడా ఎలక్షన్‌ ఇయర్‌లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయో.. ఇప్పటి నుంచే వాటిని అమలు చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

తెలంగాణలో కేసీఆర్‌ వన్స్‌మోర్‌.. ముందస్తు అని అంటారా ? గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు అమలు చేస్తారా ? ప్రతిపక్షాలు అందుకే అలర్ట్‌ అవుతున్నాయా? అంతు చిక్కకుండా ఉండే కేసీఆర్‌ వ్యూహం.. ఈసారి ఎలా ఉండబోతోంది ? విపక్షాలు కావాలనే ముందస్తు అని ప్రచారం చేస్తున్నాయా ?

ముందస్తు ఎన్నికలు.. ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే సక్సెస్‌ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది తెలంగాణ సీఎం కేసీఆరే. 1982లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, 1989లో ఎన్టీఆర్‌, 2003 చివర్లో చంద్రబాబునాయుడు..ముందస్తు ఎన్నికలకు వెళ్లి విఫలమయ్యారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం.. పక్కా వ్యూహంతో ముందస్తుకు వెళ్లి అనూహ్య విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విపక్షాలు అనేక విమర్శలు చేస్తుండటంతో.. దీనిపై తాను ప్రజాతీర్పునే కోరతానంటూ ఎన్నికలకు వెళ్లారు. అసలు విపక్షాలు ఊహించని రీతిలో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్‌.. వారిని కోలుకోకుండా చేశారు. గులాబీ పార్టీకి వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్‌కు.. రెండోసారి కూడా
అధికారం దక్కకుండా చేశారు. ఆ పార్టీని కేవలం 19 సీట్లకే పరిమితం చేశారు..

2018లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగకముందే.. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాజిటివ్‌ ఓటును కాపాడుకోవడం. రెండోది విపక్షాలు బలం పుంజుకొని తేరుకునేలోపు.. ఎన్నికలకు వెళ్లడం. మూడోది.. సార్వత్రిక ఎన్నికలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహిస్తే.. ఇక్కడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్‌ను కూడా లేకుండా చూసుకోవడం. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్‌.. ముందస్తుకు వెళ్లి సక్సెస్‌ అయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌.. తమ సంక్షేమ పథకాలని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. తాము అమలుచేస్తున్న పథకాలే అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలు.. సమర్ధంగా వ్యవహరించకపోవడం వల్లే దేశంలో ఇంకా చాలా సమస్యలు వెంటాడుతున్నాయని విమర్శిస్తున్నారు. సరికొత్త జాతీయ అజెండాతో తాము ప్రత్యామ్నాయం కాగలమని వివరిస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ జాతీయ అజెండాతో ముందుకు వెళ్తుండటంతో.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు.. కేసీఆర్‌ మళ్లీ ముందస్తుకు వెళ్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. అదిగో ఎన్నికలు.. ఇవిగో ముందస్తు అంటూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు కేసీఆర్‌ ముందస్తుకు వెళతారా, లేదా అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంది. 2023 నవంబరు-డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, 2023 ఏప్రిల్‌-మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా ఉందని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. అది మరింత పెరగకముందే ముందస్తుకు వెళ్లేందుకు కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నారని అనుమానిస్తున్నారు. గడువు ప్రకారం ఎన్నికలు
నిర్వహిస్తే.. ఏదో ఒక సాకుతో కేంద్రం లోక్‌సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ప్రమాదం ఉందని.. అది టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారుతుందని కేసీఆర్‌ అంచనా వేస్తున్నట్లు ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. అందుకే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాకుండా ఆయన జాగ్రత్త పడతారని, ఇందుకోసం అసెంబ్లీని కచ్చితంగా ముందే రద్దు చేస్తారని కమలం నేతలతో పాటు కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే విపక్షాల అంచనాలు, వాళ్ల మాటలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ మాత్రం తాము ముందస్తుకు వెళ్లేది లేదని ఇప్పటికే కరాఖండీగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు బంపర్‌ మెజార్టీ ఖాయమని స్పష్టంచేశారు.

ఎవరికీ అంతుచిక్కకుండా వ్యూహాలు రూపొందించడం.. వాటిని పక్కాగా అమలు చేయడంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. ప్రతిపక్షాలు తమకు కలిసి వస్తాయని అనుకునే అంశాలపై ఇప్పటికే కేసీఆర్‌ ఫోకస్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు.. తమకు ఎన్నికల్లో కలిసి వచ్చే ముఖ్యమైన అంశం.. ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకుంటున్నాయి. దీనిని సాధ్యమైనంత తగ్గించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి సరైన సహకారం అందటంలేదని ఆరోపణలు చేస్తున్నారు. నిధుల దగ్గర నుంచి ప్రాజెక్టుల వరకు ఏ అంశంలోనూ కేంద్రంలోని ప్రభుత్వం.. తమకు సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు. తద్వారా తెలంగాణలో బలపడేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న బీజేపీకి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. కేంద్రం వైఖరిని ఎండగడుతున్నారు. తమ వాదనకు బలంతో పాటు బలగాన్ని సమీకరించుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతల్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు కేసీఆర్‌. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌నేతలు.. ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే అదిప్రజల్లోకి తీసుకెళ్లి సీట్లు సాధించేలా చేయడంలో మాత్రం హస్తంనేతలు..రెండు ఎన్నికల్లోనూ విఫలమయ్యారు. ఈసారి కనీసం ఒక్క ఛాన్స్‌ అంటూ.. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు,తెలంగాణ ఇచ్చిన సెంటిమెంటే..హస్తం పార్టీ ప్రధాన అస్త్రాలు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌,బీజేపీల మధ్య చీలిపోయేలా టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోంది. అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని టార్గెట్‌ చేస్తూ.. ఇక్కడ ముక్కోణపు పోటీ ఉందనేలా వ్యవహరిస్తోంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నా.. అది కాంగ్రెస్‌, బీజేపీల మధ్యచీలిపోయి తమకు లాభించేలా వ్యవహరిస్తోంది. అటు కాంగ్రెస్‌ పార్టీ రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తోంది. కేవలం తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్‌నే నమ్ముకుంటే కష్టమని భావించిన రాహుల్‌ గాంధీ.. ఆ సెంటిమెంట్‌తో పాటు ప్రస్తుత సమస్యలపైనా పార్టీ ఫోకస్‌ చేసేలా దృష్టి సారించారు. అందులో భాగంగా.. రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. రైతులకు ఏం చేస్తామో స్పష్టంగా ప్రకటించారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు చాలా ముందే ఇలా డిక్లరేషన్‌ చేసి.. ఈసారి ముందస్తు వచ్చినా.. పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండేలా చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. తరచూ పార్టీ నేతలతో సమావేశమై.. అంతా ఐకమత్యంగా ఎన్నికల్లో పోరాడేలా సన్నద్ధం చేస్తున్నారు. మరి, ఈసారి కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజల్లో తమపై విశ్వాసం ఉన్నంతవరకు ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా అవి సక్సెస్‌ కావు అనే దానికి బెంగాల్‌ ఎన్నికలే ఉదాహరణ. అక్కడ బీజేపీ వేయని ఎత్తు లేదు. చేయని ఎన్నికల జిమ్మిక్కు లేదు. ఎంత చేసినా మమతా బెనర్జీపై బెంగాల్‌ ప్రజల్లో ఉన్న అభిమానం ముందు.. ఆ పావులేమి పారలేదు. తెలంగాణలో కూడా కేసీఆర్‌పై ప్రజల్లో అలాంటి అభిమానమే ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ, వాటిని అమలు చేసి సక్సెస్‌ కావడంలోనూ తమ అధినేతకు తిరుగులేదని గులాబీనేతలు చెబుతున్నారు. విపక్షాలన్నీ కేవలం తమ కేడర్‌లో జోష్‌ నింపడం కోసమే ముందస్తు అంటూ ప్రచారంచేస్తున్నాయని విమర్శిస్తున్నారు.

ఏపీలో అయితే ముందస్తు ఎన్నికల హడావుడి.. ఒక అడుగు ముందే ఉంది ? ఏకంగా పొత్తుల లెక్కలు తెరమీదకు వచ్చేస్తున్నాయి ? ఎవరు, ఎవరితో కలుస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది ? అధికార వైసీపీ మాత్రం.. సింగిల్‌గానే బరిలోకి దిగుతామంటూ స్పష్టం చేస్తోంది. గడపగడపకు పోగ్రామ్‌తో వైసీపీని ప్రజాక్షేత్రంలోకి దించారు జగన్‌. ఇక పొత్తులు పెట్టుకొని బరిలో దిగుతారా, లేక ఒంటరిగా పోటీ చేస్తారా అనేది టీడీపీ, జనసేన, బీజేపీ తేల్చుకోవాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు జపం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయం అన్నట్లు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోజనలో ఉన్నారనేది టీడీపీ నేతల వాదన. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబునాయుడు. అటు బీజేపీ కూడా ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. కమలంశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాలేదు. అయినా ఈసారి జనసేనతో కలిసి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షమైన జనసేన మాత్రం.. పొత్తుల ఆప్షన్స్‌ను తెరపైకి తీసుకొచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయని బహిరంగంగానే ప్రకటించి.. ఈ చర్చను ప్రారంభించారు. జనసేన సింగిల్‌గా పోటీచేస్తుందా, బీజేపీతో కలిసా.. లేకపోతే టీడీపీ, బీజేపీలతో కలిసి బరిలో దిగుతుందా అనే ఆప్షన్లు తమ ముందు ఉన్నాయని పవన్‌ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ప్రయత్నిస్తానని.. అయితే అందుకోసం తాను తగ్గేది లేదంటూ సిగ్నల్స్‌ ఇచ్చారు. పరోక్షంగా టీడీపీ ఈసారి తగ్గాలంటూ సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే వాతావరణం కల్పిస్తున్నాయి

టీడీపీ, బీజేపీ, జనసేన వైఖరి ఎలా ఉన్నా.. అధికార వైసీపీ మాత్రం ఎలెక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, వెళ్లకపోయినా.. పార్టీని, ప్రభుత్వాన్ని మాత్రం ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్‌ పెట్టిన జగన్‌.. ఇప్పుడు గడపగడపకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాము అమలు చేసిన సంక్షేమం గురించి ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతలు ప్రజల్లో తిరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా.. గడపగడపకు కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలకు ఓరియంటేషన్‌ క్లాస్‌ తీసుకున్నారంటే.. దీనిని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్ధమవుతోంది. వైసీపీ ఇదంతా చేస్తోంది ముందస్తు కోసమే అని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. తాము కూడా అందుకు రెడీ అంటూ ఛాలెంజ్‌ చేస్తున్నాయి.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్‌ నిర్ణయం తీసుకున్నారా, లేదా అన్నది ఎవరికీ తెలియదు. అంత అవసరం ఆయనకు ఉందని వైసీపీ నేతలు భావించడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వచ్చింది. దాదాపు 50శాతం ఓట్లతో 151 సీట్లు సాధించింది. టీడీపీ 39 శాతం ఓట్లతో.. 23 సీట్లు..జనసేన 6.5 శాతం ఓట్లతో ఒక సీటు సాధించాయి. ఇక బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. స్థానిక ఎన్నికల్లోనూ, ఉపఎన్నికల్లోనూ విపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏమేరకు బలపడ్డాయో తెలియదు.
అయినా ఏపీలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనేది విపక్షాల వాదన. సంక్షేమానికి కోట్లు ఖర్చు పెడుతున్న జగన్‌.. అభివృద్ధి చేయడంలేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఇదే ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమని నమ్ముతున్నాయి. విపక్షాల వాదనల్ని కొట్టిపారేస్తున్న అధికార పార్టీ.. తమకు ముందస్తు అవసరం లేదని ఢంకా బజాయించి చెబుతోంది..

మహానాడు తర్వాత టీడీపీ స్వరం మారింది. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా వర్చువల్‌గా జరిగిన మహానాడును ఈసారి ఘనంగా నిర్వహించింది. అది సక్సెస్‌ అయిందని.. ఇదంతా టీడీపీకి పెరుగుతున్న ఆదరణకు సిగ్నల్‌ అని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమం అయిన మహానాడు సక్సెస్‌ అయినంత మాత్రాన.. అది ప్రభుత్వ వ్యతిరేకతకు సూచన ఎలా అవుతుందని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు ఏదో ఒక ప్రచారం చేస్తూ.. తమ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ, జనసేనకి ఏపీలో ఎంత బలం ఉందో.. గత ఎన్నికల్లో స్పష్టమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు తిరుగులేదని అధికార పార్టీ ధీమాతో ఉంది.

ఇక ముందస్తు ఎన్నికల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 1978 వరకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టగానే.. ఆయనను దెబ్బకొట్టడానికి 7 నెలల ముందు ఎన్నికలకు వెళ్లారు కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి. అప్పుడు ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలు.. జనవరిలోనే జరిగాయి. అయినా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ముందస్తు ప్రయత్నం విఫలమై..ఎన్టీఆర్‌ 202 సీట్లను గెలుచుకున్నారు. 1989లో రెండోసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ముందస్తుకు వెళ్లిన ఎన్టీఆర్‌ ఓటమిపాలయ్యారు. ఇక
2003 చివర్లో చంద్రబాబునాయుడు ముందస్తుకు వెళ్లి అధికారాన్ని తిరిగి సాధించలేకపోయారు. ఉమ్మడి ఏపీలో ముందస్తుకు వెళ్లి ఎవరూ సక్సెస్‌ కాలేదు. తెలంగాణలో కేసీఆర్‌ మాత్రం ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేశారు. మరి, తెలుగు రాష్ట్రాల సీఎంలు.. విపక్షాలు ఊహిస్తున్నట్లుగా ముందస్తుకు వెళతారా, లేక షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు ఆగక తప్పదు.