అమెరికా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం. అలాంటి అమెరికా దాదాపు రెండేళ్లు కరోనాతో విలవిల్లాడింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు.. అక్కడే నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యం కోలుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గి.. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని.. అంతా మామూలు స్థితికి చేరుకుంటుందని అంతా భావించారు. అయితే అనుకున్నది ఒకటి అయితే.. ఇప్పుడు జరుగుతోంది మరొకటి. కరోనా సంక్షోభం తర్వాత గాడినపడుతుందనుకున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం అధిక ధరలతో అల్లాడుతోంది. ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు మార్కెట్లను మరింత కల్లోలంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం అమెరికా వృద్ధిరేటును కుదించి, గోల్డ్‌మన్‌శాక్స్ ఆర్థిక వేత్తలు అంచనాలు వెలువరించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్‌మన్‌శాక్స్ సీనియర్ ఛైర్మన్ లాయిడ్ బ్లాంక్‌ఫెయిన్ వ్యాఖ్యలు, అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
అమెరికాలో ప్రజలు, కంపెనీలు ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు గోల్డ్‌మన్‌శాక్స్ సీనియర్ ఛైర్మన్ లాయిడ్ బ్లాంక్‌ఫెయిన్. అమెరికా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, రాబోయే రోజుల్లో వెరీవెరీ హైరిస్క్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూడబోతోందన్నారు లాయిడ్.
లాయిడ్ బ్లాంక్‌ఫెయిన్.. అమెరికా ఆర్థిక వ్యవహారాల్లో తలపండిన ప్రముఖుడు కావడంతో, లాయిడ్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాకు రాబోయే కాలంలో మహా మాంద్యం పొంచివుందన్న వ్యాఖ్యలపై ఇప్పడు ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. సప్లయ్ చైన్ వ్యవస్థ అమెరికా సరిహద్దుల పరిధిలో లేకపోవడం సమస్యాత్మకంగా మారిందన్నది లాయిడ్ మాట. వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా దెబ్బతిని, 2011 స్థాయి నాటికి చేరింది. అమెరికాలో ధరలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌లో 8.3శాతం పెరిగాయి. గోల్డ్‌మన్‌శాక్స్ కూడా అమెరికా జీడీపీ వృద్ధిరేటు 2.6శాతం నుంచి 2.4శాతానికి తగ్గవచ్చని.. 2023కంతా ఇది 1.6శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. లాయిడ్, గోల్డ్‌మన్‌శాక్స్ అంచనాలతో ప్రపంచ ఆర్ధికంపై పిడుగు పడినట్లైంది..
అమెరికాలో మాంద్యం వస్తే.. ఆ ప్రభావం చాలాదేశాలపై ఉంటుంది. ఆ దేశం నుంచి పెట్టుబడులు తగ్గుతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రంగాలు ప్రభావితమవుతాయి. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంటే.. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడుతుంది. అయితే గతంలో మాంద్యం వచ్చినప్పుడు.. భారత్ సమర్ధంగా బయటపడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. అధిక ధరలు అమెరికాలోనే కాదు.. మనదేశంలోనూ ఉన్నాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు మండిపోవడంతో గత నెలలో హోల్‌సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో నమోదైంది. ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 15.08 శాతానికి చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 14.55శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 10.74శాతంగా ఉండేది. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదు కావడం వరుసగా ఇది 13వ నెల. ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి..
ఏప్రిల్ నెలలో చమురు ధరలతో పాటు ఆహార, ఆహారేతర పదార్థాలు, రసాయనాలు ఇలా అనేక వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం ఆల్‌టైం గరిష్ఠానికి చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. గత నెలలో కూరగాయలు, గోధుమలు, పండ్ల ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.35శాతానికి ఎగబాకింది. అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌లో 8 నెలల గరిష్ఠానికి చేరింది. 2014 మే నెలలో రికార్డు స్థాయిలో 8.33శాతంగా నమోదు కాగా.. ఆ తర్వాత అదే స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఆర్‌బీఐ రెపో రేటును పెంచాల్సి వచ్చింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం అది 4.40 శాతానికి చేరింది. అయితే ప్రస్తుతం టోకు ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరగడంతో.. ఆర్‌బీఐ వచ్చే నెలలో జరగబోయే పరపతి విధాన సమీక్షలో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా భారత్‌లో ఆర్ధిక పరిస్థితి సవ్యంగా లేదని సూచిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి ఇంకా ఎంత భయంకరంగా మారుతుందో అన్న భయం వెంటాడుతోంది.
భారత్‌లో ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా కనిపించడంలేదు. కూరగాయల నుంచి పెట్రోల్ వరకు.. అన్ని ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పెరిగిన నిత్యాసర ధరలు.. ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడంలేదు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కూడా.. ఆర్ధిక వ్యవస్థ పరిస్థితిని తెలియజేస్తోంది.
ఇవి గత కొద్దిరోజులుగా భారత ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు. భారత కరెన్సీ రూపాయి విలువ పతనం గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం కూడా రూపాయి విలువ కోల్పోవటానికి కారణంగా నిలుస్తోంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ 77 స్థాయిని.. మార్చిలో తొలిసారిగా దాటింది. త్వరలో 77 స్థాయిని కూడా దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రూపాయి మారకపు విలువ సుమారు రూ.80 వరకు పడివోవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల కూడా డాలర్ పై ప్రభావం పడుతోంది. డాలర్ తో రూపాయి విలువ పతనం ఇలాగే కొనసాగితే దిగుమతులు మరింతగా భారం కానున్నాయి. దీని వల్ల క్రూడ్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మనదేశంలో ధరల మోత.. మరింత పెరిగిపోనుంది. ఇది సామాన్యుల జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది..
వంట నూనె మొదలు పెట్రోలు, మందులు, ఎలక్ట్రానిక్స్ వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. చమురు ధరల పెరుగుదలతో.. కూరగాయలు, పాలతో పాటు అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈ భారంతో.. అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా అనంతర పరిస్థితులతో చాలా వస్తువులకు కొరత ఏర్పడింది.ఉక్రెయిన్ సంక్షోభంతో వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు ముండుతున్నాయి. వీటికి తోడు చముర మంట తోడవడంతో.. సామాన్యుడు ఏమీ కొనలేని.. ఏమీ తినలేని పరిస్థితి ఉంది.
అటు స్టాక్ మార్కెట్ల కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2021 డిసెంబర్ చివరికి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల్లో.. విదేశీ ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్టర్ల వాటాలు 9 ఏళ్ల కనిష్టానికి తగ్గాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐల వాటా ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో 0.81 శాతం తగ్గి 19.7 శాతానికి పరిమితమైంది. ఇలా ఎఫ్‌ఐఐల వాటాలు క్షీణించడం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ నమోదైంది. ఇలా వాటాలు తగ్గిపోవడం వెనుక గత ఏడాదిగా విదేశీ ఇనిస్టిట్యూషన్స్.. భారత మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుండడం ప్రధాన కారణం. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా ఆంక్షలు ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇలా ఉంటే.. మానుఫ్యాక్చరింగ్ రంగం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి సాధించడంలేదు. ఆర్థిక మాంద్యం, ఆ పై, కోవిడ్ మహమ్మారి విరుచుకుపడడంతో ఛిద్రమైన ప్రజల జీవితాలు కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా మెరుగుపడతాయని ఆశించినవారికి ఈ సంకేతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బిజినెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ స్థూలంగా చూసినప్పుడు ఇప్పటికీ చాలా కంపెనీలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి కార్యకలాపాలు మామూలు సామర్ధ్య స్థాయికి చేరుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. దీనికి అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, నిజ వేతనాలు పడిపోవడం ముఖ్య కారణాలు. పారిశ్రామిక మాంద్యం నుంచి బయటపడేందుకు.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో ప్రకటించిన 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ప్రజలకు ఇచ్చింది ఒక శాతం మాత్రమే. మిగిలినదంతా కార్పొరేట్లకు వెళ్లాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 9 శాతం దాకా ఉండొచ్చనుకున్న జిడిపి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు మన జిడిపి 7.5 శాతానికి మించకపోవచ్చని అంచనా వేశాయి.
మన దేశంలో రికార్డు స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం.. అనేక రంగాలపై దుష్ప్రభావం చూపిస్తోంది. ప్రత్యేకించి పేదలు, చిన్న పరిశ్రమలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు భరించవు. వాటిని వినియోగదారులపైకే నెట్టివేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను.. వ్యాట్, సెస్సు రూపంలో ప్రభుత్వాలు పిండుకుంటున్నాయి. సామాన్యుడు ధరల పెరుగుదలతో అల్లాడుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం తమ పన్ను వసూళ్ల టార్గెట్లు అందుకుంటున్నామని ఆనందిస్తున్నాయి తప్ప.. సామాన్యుడి గోడు పట్టించుకునే పరిస్థితిలో లేవు.
ఆర్ధిక మాంద్యం.. ఈ పేరు వింటేనే చాలామందికి నిద్రపట్టదు. ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు టెన్షన్ పెరిగిపోతుంది ? అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది ? 2008లో మాంద్యంకు కారణం ఏంటి ? ఇప్పుడు రాబోయే రెసిషన్.. ప్రపంచదేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది ?
మాంద్యం అంటే మందగమనం. మాంద్యం ఏర్పడితే ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోతాయి. మాంద్యం అనేది కొన్ని నెలల నుండి ఎన్నో సంవత్సరాలు కూడా ఉండవచ్చు. నిజమైన స్థూల జాతీయోత్పత్తి, ఆదాయం, ఉపాధి, తయారీ మరియు రిటైల్ అమ్మకాలు పడిపోతాయి. ఆర్థిక వ్యవస్థలో ‘జిడిపి’ని ఆర్ధిక వృద్ధికి కొలమానంగా చెబుతారు. వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాలలో ఒక దేశ జిడిపి వృద్ధిలో తగ్గుదల కనిపిస్తే.. మాంద్యం ఏర్పడినట్లు భావిస్తారు. అయితే కేవలం ‘జిడిపి’ ని మాత్రమే మాంద్యానికి కొలమానంగా చెప్పలేము. జిడిపితో పాటు ఉపాధి, పారిశ్రామిక ఉత్పత్తి, ఆదాయం మరియు రిటైల్ అమ్మకాలను కూడా ముఖ్య సూచికలుగా చూస్తారు.
ధరలు పెరగడం వలన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం లేకపోవడంతో వినియోగదారులు తమ ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెడతారు. వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవడంతో ఉత్పత్తుల డిమాండ్ తగ్గుతుంది. ఇది తయారీదారుల ఉత్పత్తి తగ్గించటానికి దారితీస్తుంది. ఉత్పత్తి స్థాయిలు తక్కువగా ఉండటంతో సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటాయి. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఇదంతా ఆర్ధిక వ్యవస్థ అంతా ఒక సైకిల్ చెయిన్‌లాంటిది. ఒకచోట స్ట్రక్ అయితే.. ముందుకు వెళ్లడం కష్టం. మాంద్యం పరిస్థితుల్లో.. కొత్త పెట్టుబడులు రావడం కష్టమవుతుంది. ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కొన్ని కార్పోరేట్లు ప్రయత్నిస్తాయి. తద్వారా మార్కెట్లో నిధుల ఫ్లో తగ్గిపోతుంది. చిన్న సంస్థలు నిలబడలేక దివాలా తీస్తాయి. బ్యాంకుల వడ్డీ రేట్లలో కోతలు విధిస్తు వస్తాయి. రుణాల మంజూరు చేయటం తగ్గించటం లేదా పూర్తిగా ఆపి వేసే పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతుంది.
2006-07 లో అమెరికాలో మొదలైన మాంద్యం ప్రపంచమంతా పాకింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. 2008లో వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ ‘లెహ్మాన్ బ్రదర్స్’ దివాలా తీయడం వల్ల అమెరికా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం మొదలైంది. వివిధ దేశాల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవల రంగాలకున్న అనుసంధానం కారణంగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావం చూపింది. బ్యాంకులు అధికంగా రిస్క్ తీసుకోవటం, అమెరికన్ రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉన్న తనఖా-ఆధారిత సెక్యూరిటీల విలువలు క్షీణించి, ఆర్థిక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నష్టాలు చవిచూశాయి. అనంతరం ఇది అన్ని రంగాల సంక్షోభంగా మారింది. గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. వందల కోట్ల డాలర్ల మదుపర్ల సంపద ఇట్టే ఆవిరైంది. వినియోగదారుల డిమాండ్‌పై కోలుకోలేని ప్రభావం పడింది. ఈ పరిస్థితులన్నీ ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి.
2008 మాంద్యం సమయంలో తొలుత బ్యాంకింగ్ రంగాన్ని ఆవహించిన సంక్షోభం.. నిదానంగా వాస్తవ ఆర్థిక వ్యవస్థకు పాకింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కరోనా సంక్షోభం తర్వాత సప్లయ్ చెయిన్ దెబ్బతినడం.. చాలా దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోలేకపోవడంతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ప్రభావం చూపుతున్నాయి. అప్పుడు అమెరికాలో సంక్షోభం మొదలైతే.. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి పరిస్థితే ఉంది. ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయనే వార్త అందరినీ కలవరపెడుతోంది. శ్రీలంక నుంచి ఐరోపా దేశాల వరకు.. పలుదేశాల్లో ఇదే పరిస్థితి ఉంది.
డాలర్లు అడుగంటడం, లెక్కకు మిక్కలి అప్పులు, తీవ్ర నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం.. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల కష్టాలకు కారణం. దాదాపు ఇవే పరిస్థితులు.. మన పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్‌లలో ఉన్నాయి. చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్న లంక.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దాదాపు 69 దేశాల్లో శ్రీలంకలో ఉన్న పరిస్థితులే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఎప్పుడో ముగుస్తుందో.. ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో చమురు ధరలు, వంట నూనెల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగాయి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు పావు శాతం అంటే 25 శాతం రష్యానే తీరుస్తోంది. అలాగే వనస్పతి నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్ ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా ఉంది.
యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో.. వీటి ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. రష్యాపై అమెరికా – బ్రిటన్ – జర్మనీ – కెనడా – ఫ్రాన్స్ – జపాన్ – దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ప్రభావమంతా ప్రపంచంలోని పేద దేశాల మీదే పడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో 107 దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్టు 2022 మార్చిలోనే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక కష్టాలు మొదలవుతాయని వెల్లడించింది. ఆయా దేశాల్లో 170 కోట్ల మంది ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడతారని బాంబు పేల్చింది. ఆర్థిక మాంద్యం బారినపడే 69 దేశాల్లో 25 ఆఫ్రికా దేశాలు ఉండగా మరో 25 ఆసియా పసిఫిక్ దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 19 లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి.
ఆర్థిక మాంద్యం…. ఈ పేరు వింటే చాలు ప్రపంచంలోని ఏ దేశమైనా గడలాడాల్సిందే. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే ఇక దానిని గాడిలో పెట్టేందుకు ఆ దేశ పరిపాలకులకు తలకు మించిన భారమై కూర్చుంటుంది. 2008 రెసిషన్ సమయంలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి గురికాకుండా ఉండటానికి ఆర్థిక సంస్థలు.. భారీ బెయిల్-అవుట్లు, ఉపశమన చర్యలు తీసుకున్నారు. ఉద్దీపన ప్యాకేజీలతో.. మాంద్యం పరిస్థితుల నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు కూడా అమెరికాలో మాంద్యం వస్తుందనే భయం.. ప్రపంచదేశాలను వెంటాడుతోంది.
ఒక దేశంలో ప్రారంభమయ్యే మాంద్యం అంటువ్యాధిలా ఇతర దేశాలకూ విస్తరిస్తుంది. ఈ భయం.. భారత్‌నూ వేధిస్తోంది. 2008 సమయంలో.. భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడంతో కొద్దిపాటి ప్రభావంతోనే బయటపడగలిగింది. ఇప్పుడు కూడా మన ఆర్ధిక వ్యవస్థ సేఫ్‌గా.. మాంద్యం ప్రభావం నుంచి బయటపడాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్న విధంగా కాకుండా.. సామాన్యులను ఆదుకోవాలనే నిబద్ధతతో చర్యలు కొనసాగించాలి.
వ్యవసాయ, ఉత్పత్తి రంగంలో బడా కార్పోరేట్లనే కాకుండా చిన్నవర్గాలను ప్రోత్సహించాలి. వ్యవసాయ ఆధారిత దేశం కావడమే 2009లో భారత్‌ను మాంద్యం బారిన పడకుండా చేసింది. ఈ విషయాన్ని మన పాలకులు మరచిపోకూడదు. రైతులను మరింత కష్టాల్లో నెట్టకుండా.. అన్నదాతలను ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ఇక ఆకాశాన్నంటున్న ధరలకు ప్రధాన కారణం.. పెట్రోల్, డీజిల్ ధరలు. లీటరు 120రూపాయలు ఉంటే.. అందులో సగానికిపైగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్నవే అని కామన్ మేన్‌కు కూడా తెలుసు. ఈ పన్నులు కాస్త తగ్గిస్తే.. అన్ని వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.. సొంత లాభం మానుకొని అయితే కొంత మేలు చేస్తేనే.. రెసిషన్‌ను భారత్ సమర్ధంగా ఎదుర్కోగలుగుతుంది. అలా కాకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తే.. లంకకు పట్టిన గతే మనకు పడుతుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.