Indian Rupee : సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతోంది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెను భారం పడుతుంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున, ముడి చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతాయి.
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది.
రూపాయి పతనం రికార్డు స్థాయికి చేరింది. చరిత్రలో కనీవినీ ఎరుగని వేగంతో కరెన్సీ విలువ పడిపోతోంది. దీని వల్ల సామాన్యులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. చమురు బిల్లు దగ్గర్నుంచి నిత్యావసరాల వరకూ అన్నింటి మీదా రూపాయి ప్రభావం ఉంటుంది. అమెరికాలో కూడా పరిస్థితి బాగాలేకపోయినా.. డాలర్ బలంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం విదేశీ మారక నిల్వలే అనే అంచనా ఉంది. మన దేశ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొన్నాళ్లుగా పెరుగుతున్న దిగుమతులతో విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. డాలర్ కు బదులు రూపాయితో విదేశీ వాణిజ్యం చేయడం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీని కోసం ఆర్బీఐ పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఆచరణలోకి రాలేదు. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే.. దిగుమతి బిల్లు తగ్గించుకోవాలనే అభిప్రాయాలున్నాయి. మనం ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిలో దేన్నీ తగ్గించుకునే పరిస్థితి లేదు. చమురు ప్రభావం డైరక్టుగా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే నిల్వలు తగ్గిపోతాయి. అది కూడా ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం కారణంగా ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు.
శుక్రవారం వరుసగా ఐదో సెషన్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డ్ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, స్థానిక మార్కెట్ నుంచి ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండటం, వాణిజ్య లోటు పెరగడం వంటి కారణాలతో భారత రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారీగా క్షీణించింది. జులై 15న భారత రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు తగ్గి 79.92 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
గురువారం సెషన్‌లో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి 79.72 వద్ద ప్రారంభమై 79.71కి చేరుకుంది. తిరిగి 79.92 పాయింట్ల ఆల్‌టైం రికార్డ్ లో-లెవల్‌కి చేరుకుంది. బుధవారం ట్రేడింగ్‌తో పోలిస్తే గురువారం ట్రేడింగ్‌లో తొమ్మిది పైసలు నష్టపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యులు, వివిధ కంపెనీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బలమైన డాలర్, నిరాశావాద గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ల మధ్య రూపాయి క్షీణిస్తోంది. స్థిరమైన FII అవుట్‌ఫ్లోలు, దూసుకుపోతున్న మాంద్యంపై ఆందోళనలు రూపాయిని దెబ్బతీస్తాయి. ఇంకా యూఎస్ నుంచి కీలకమైన ఆర్థిక డేటా, ఫెడ్ అధికారుల ప్రకటనల ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. యూఎస్ డాలర్, భారత రూపాయి 79.60- 80.20 శ్రేణిలో ట్రేడ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్‌లలోనే జరుగుతుంది కాబట్టి, సప్లై చేసే దేశానికి డాలర్‌లలోనే డబ్బు చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ముడిసరకు ఎక్కువగా దిగుమతి చేసుకునే కంపెనీలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇతర దేశాలకు విహారయాత్రకు వెళ్లాలంటే కూడా ఎక్కువ నగదు అవసరమవుతుంది. ఇతర దేశాలకు పై చదువులకు వెళ్లే విద్యార్థులపై భారం పెరుగుతుంది. ఇతర దేశాలకు వస్తువులు, సేవలు అందించే కంపెనీలు మాత్రం లాభపడతాయి.
కరోనా మహమ్మారి.. అంతకుముందు ఆర్థిక మందగమనం.. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దరిమిలా మన కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు ఆల్‌టైం రికార్డుల దిశగా పతనం అవుతోంది. ఎప్పుడూ లేని రీతిలో 80కి చేరువైంది. దీంతో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ వైపు రూపాయి పతనమవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వానికి ఓ దశాదిశ కరవైందని దుయ్యబట్టింది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది.
2014లో రూపాయి విలువ 58గా ఉండేది. ఈ ఎనిమిదేళ్లలో మోడీ పాలనా కాలంలో తొలుత రిటైర్మెంట్ వయసు దాటించారు. తర్వాత మార్గదర్శక మండలినీ దాటించారు. ఇప్పుడు 80+కూడా దాటించేస్తున్నారు.. అంటూ కాంగ్రెస్ కేంద్రంపై సెటైర్ వేసింది. బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేశారు. ఓ వైపు రూపాయి పడిపోతోందని, నిరుద్యోగం పెరిగిపోతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జాబితా పెరిగిపోతోందని అంటున్నాయి.
.అమెరికాలో ద్రవ్యోల్బణం 9 శాతం దాటడంతో ఫెడ్ 75 బేసిస్ పాయింట్లకంటే ఎక్కువగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయని, దాంతో రూపాయి క్షీణిస్తున్నదని వాదనలున్నాయి. స్వల్పకాలంలో డాలర్/రూపాయి స్పాట్ విలువ 79.40-80 మధ్య ట్రేడ్ కావొచ్చని అంచనా. ఎలక్ట్రానిక్స్ పరికరాలతోపాటు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విదేశాల్లో విద్యనభ్యసించేవారికి మరింత ఖర్చు పెరుగుతుంది. వర్సిటీల్లో ఫీజుకు, అక్కడ జీవన వ్యయం కోసం డాలర్లలోకి మార్చుకునేందుకు ఎక్కువ రూపాయిలు అవసరమవుతాయి.
భారత కరెన్సీ విలువ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ క్రమంగా బలం పుంజుకుంటుడటంతో పాటు మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమైంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 27 సార్లు సరికొత్త ఆల్‌టైం రికార్డు కనిష్ఠాలను నమోదు చేసుకుంది. కేవలం ఈ నెలలోనే 6 సార్లు కొత్త రికార్డు కనిష్ఠాలకు పతనమైంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.74 వద్ద ట్రేడైన డాలర్-రూపాయి మారకం రేటు గడిచిన ఆరున్నర నెలల్లో దాదాపు రూ.80కి చేరువైంది. అనగా, ఈ ఏడాదిలో రూపాయి విలువ 7 శాతానికి పైగా క్షీణించింది. అతి త్వరలోనే డాలర్-రూపీ మారకం రేటు రూ.80 దాటడం ఖాయమని ఫారెక్స్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్ఛేంజ్ రేటు రూ.81-82 స్థాయికి చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్బణం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, దిగుమతుల భారం రూపాయి పతనానికి కారణమని వారు పేర్కొన్నారు.
రూపాయి క్షీణతతో ఎగుమతిదారులకు అధిక ఆదాయం లభించినప్పటికీ, దిగుమతులు భారంగా మారడంతో పాటు ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కరెంట్ ఖాతా లోటు నియంత్రణ లక్ష్యం అదుపు తప్పవచ్చు. అంతేకాదు, దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు పెరిగితే ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించడం మరింత సవాలుగా మారుతుంది. ధరల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా పెంచాల్సి రావచ్చు. తత్ఫలితంగా రుణాలు మరింత ప్రియమవుతాయి. వ్యవస్థలో నిధుల లభ్యత తగ్గితే, కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది.
రూపాయి విలువ క్షీణత ప్రజల వినియోగ నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎందుకంటే, రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఆధారిత రంగాలైన వాహనం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తదితర వస్తువులు మరింత ప్రియమవుతాయి. అలాగే, విదేశీ విద్య, వీసా ఫీజులు, విదేశీ యాత్రలు మరింత భారంగా మారుతుంది. అయితే, విదేశాల్లోని సంబంధీకుల నుంచి రెమిటెన్స్‌ల రూపంలో సొమ్ము అందుకునే వారికి మాత్రం గతంలో కంటే అధిక మొత్తం లభించనుంది.
డాలర్ మారకంలో ఇతర కరెన్సీలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్నడూ లేనంత స్థాయిలో పడిపోతున్నాయి. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయిలకి పడిపోయి 80కి చేరువలో నమోదైతే.. యూరో వాల్యూ సైతం కుప్పకూలింది. ప్రస్తుతం డాలర్ మారకానికి సమానంలో యూరో వాల్యూ నమోదవుతోంది. గత 20 ఏళ్లలో యూరోకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇది రెండోసారి. 2002లో నవంబర్‌లో కూడా ఇలానే యూరో వాల్యూ కుప్పకూలింది. ఇప్పుడు మరోసారి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, మందగమన భయాలు, ద్రవ్యోల్బణం అన్ని కలిసి యూరోను కిందకి పడేస్తున్నాయి.
డాలర్ మారకంలో యూరో వాల్యూ భారీగా పడిపోయింది. ప్రస్తుతం యూరో వాల్యూ డాలర్‌కు సమానమైన రీతిలో ట్రేడవుతోంది. అంటే 1 డాలర్ వాల్యూ 1 యూరో వాల్యూకి సమానంగా ఉంది. గత ఇరవై ఏళ్లలో ఇలా ఈ రెండు కరెన్సీలు సమానంగా నమోదు కావడం ఇది రెండోసారి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంపు భయాలతో యూరో అతలాకుతలమవుతోంది. డాలర్ మారకంలో యూరో వాల్యూ కుప్పకూలుతోంది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ డేటా కూడా భారీగా పెరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత.. యూరో ఎకానమీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య సంక్షోభం ప్రారంభమైన తర్వాత.. యూరప్ దేశాలలో ఇంధన సమస్యలు భారీగా తలెత్తాయి. రష్యా నుంచి చమురు కొనడం తగ్గించిన తర్వాత.. ఆ ధరలు భారీగా పెరిగాయి. దీంతో అక్కడ సామాన్యులపై తీవ్ర భారం పడింది.
ప్రస్తుతం ఇన్వెస్టర్ల చూపంతా యూరో కరెన్సీపైనే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే యూరో వాల్యూ మరింత కిందకి పడుతుందా..? అని చూస్తున్నారు. డాలర్ మారకంలో యూరో వాల్యూ తొలిసారి 2002 నవంబర్‌లో కిందకి పడిపోయింది. ఆ సమయంలో యూరో వాల్యూ 0.99 డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ యూరో వాల్యూ స్థిరంగా పెరిగింది. 2008 సంక్షోభ సమయంలో యూరో వాల్యూ 1.60 డాలర్లుగా నమోదైంది. కానీ ప్రస్తుతం మళ్లీ యూరో వాల్యూ పడిపోతుంది. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలలో నమోదవుతోంది. జూన్ నెలలో యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలో మందగమన కారణంతో.. యూరో మరింత క్షీణిస్తోందని అనలిస్టులు చెబుతున్నారు.
మరోవైపు అమెరికా పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు వడ్డీ రేట్ల పెంపు విషయంలో అసలు వెనుకడుగు వేయడం లేదు. కానీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు మాత్రం వడ్డీ రేట్ల పెంపు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో అమెరికాలో ఎక్కువ ఆదాయాలు ఆర్జించవచ్చని పెట్టుబడిదారులు యూరో నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని, డాలర్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా యూరోను దెబ్బకొడుతోంది. యూరో వాల్యూ భారీగా క్షీణిస్తుండటంతో… యూరోపియన్ కంపెనీలు వారు దిగుమతి చేసుకునే వస్తువులకు, సేవలకు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో యూరోపియన్ ఎగుమతులు చాలా చౌకగా మారనున్నాయి. ఫిబ్రవరి నుంచి యూరో వాల్యూ భారీగా క్షీణించింది. ఫిబ్రవరిలో యూరో వాల్యూ 1.13 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు రూపాయి వాల్యూ కూడా జీవన కాల కనిష్టాలకు పడిపోయింది. 80కి చేరువలో రూపాయి వాల్యూ క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తే చాలా రకాల నష్టాలు ఉంటాయ్. రూపాయి బలహీనపడటంతో.. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చమురుతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలను భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
మనదేశం వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన సరళీకృత విధానం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ విధానాన్ని అమలు చేయడానికి దాదాపు గత పది సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక పరిమితులు అందుకు అడ్డు రావడంతో ఈ విధానం ఎక్కడ వేసిన గొంగళి లా అక్కడే ఉందనేది వాస్తం.ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే కరెన్సీగా డాలర్ చలామణి అవుతుంది.దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత కరెన్సీ అధికంగా ఉపయోగించాల్సి వస్తుంది.
అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడి కార్యకలాపాల లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది.దాంతో భారత్ రావాలసిన అనేక లాభాలు సగానికి సగం తగ్గిపోతున్నాయనేదివాస్తవం.
ఇది గ్రహించిన రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఆలోచనను శ్రీకారం చుట్టింది.అదే డాలర్ విలువను తగ్గించి రూపాయి విలువను పెంచే ప్రక్రియ. స్వాతంత్ర్యం తర్వాత భారత్ లో రూపాయి విలువ గోల్డ్ విలువతో పోల్చే వారు.ఇది 1960 ప్రారంభంలో తూర్పు ఐరోపాతో భారతదేశం యొక్క చెల్లింపు ఒప్పందాలలో రూపాయి ఖాతా యూనిట్ గా భావించేవారు .అంటే రూపాయి మారకం విలువ బంగారం పరంగా నిర్ణయించారు.1966 లో రూపాయి విలువ తగ్గింపుకు అసలు కారణమైన బంగారం నిబంధనపై దృష్టి పడింది.
అప్పటి యూఎస్ ఎస్ ఆర్ తో చెట్టా పట్టాలేసుకుని తిరిగిన భారత్ తన వాణిజ్య ఒప్పాందాలపై రష్యా ఒకింత మొహమాటపెట్టింది.రెండు దేశాలకు మధ్య ఉన్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఒప్పందాల్లోని చెల్లింపుల నిబంధనలు ఇతర దేశాలవాణిజ్య ఒప్పందాలకు లింకు పెట్టింది.అప్పట్లో రష్యా ప్రపోజల్స్ భారత్ కు ఇష్టం లేకపోయినా, రూపాయి తగ్గింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.అప్పటి రూపాయి విలువ తగ్గేసరికి అంటే చౌకగా ఎగుమతులు, ఎక్కువ ధరకు దిగుమతులు లాంటి ప్రక్రియ చేపట్టడం అనే విధానంలో విదేశాలనుంచి అధికాలాభాలను ఆశించినట్లు భావించాలి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనం అవడంతో దేశ దిగుమతు బిల్లు అనూహ్యంగా పెరిగిపోతోంది. రూపాయి పతనం మన దేశ దిగుమతులతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్ధులపైనా , విదేశాల్లో పర్యటనకు వెళ్లే వారిపైనా అదనపు భారం పడుతోంది. దిగుమతి చేసుకుంటున్న సరుకుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరుగుతోంది.
మన దేశీయ అవసరాల్లో 80 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంటనూనెలు, విజిటెబుల్ ఆయిల్, భారీ యంత్రాలు, ప్లాస్టిక్, ఎరువులు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్స్, బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇనుము ఇలా అనేకం దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం కావడంతో దిగుమతుల బిల్లు పెరుగుతోంది. దీని వల్ల మనం డాలర్లలో అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూపాయి పతనం వల్ల గతంలో మనం దిగుమతి చేసుకున్న వాటి పరిమాణం మారనప్పటికీ, చెల్లింపులు మాత్రం ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఎగుమతులకు మాత్రం మనం ఎక్కువ పొందుతాం. అయితే ఇవి చాలా స్వల్పంగా ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. చమురు ధరలు భారీగా తగ్గిన్పటికీ ఆ స్థాయిలో మన ఎగుమతులు లేనందువల్ల చమురు బిల్లు భారీగా పెరిగింది. దీని వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిలువలు సైతం తగ్గిపోతున్నాయి. రూపాయి పతనంలో ధరలు పెరుతుండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతోంది.
విదేశీ మార్కెట్లలో US డాలర్ స్థిరంగా ఉండటం, క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్ పెరగడం లాంటి కారణాలతో రూపాయి క్షీణించి కనిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి నష్టాలను పరిమితం చేశాయంటున్నారు ఫారెక్స్ డీలర్లు. రూపాయి క్షీణిస్తే చాలా నష్టాలున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతులు భారం అవుతాయి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లిస్తే ఇకపై అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఏడు శాతానికి పైగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ 2 శాతం నుంచి 6 శాతం మాత్రమే.
భారతదేశం దిగుమతులపై ఆధారపడటం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ వంటి రంగాలపై ప్రభావం తప్పదు. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లకు కూడా ఇబ్బందులు తప్పవు. రూపాయి పడిపోవడం, దిగుమతి రంగాలకు ఖర్చులు పెరగడం, వాటి ఆదాయాలకు గండి పడటం లాంటి పరిణామాలు ఉంటాయి. ఇక విదేశాల్లో చదువుకునేవారి ఖర్చులు పెరగనున్నాయి. అంటే విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతదేశం నుంచి డబ్బులు పంపాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా కాస్ట్‌లీగా మారబోతున్నాయి. డాలర్లలో చెల్లించాలి కాబట్టి డాలర్లు కొనడానికి ఎక్కువ ఖర్చు చేయాలి. అమెరికా డాలర్‌ను విక్రయించేందుకు ఎస్‌బీఐ తదితర ప్రధాన బ్యాంక్‌లు ఇప్పటికే 80కిపైగా కోట్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు పటిష్ఠంగా ఉండటంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాల్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో అమెరికా కరెన్సీ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ఠస్థాయి 109 సమీపంలో ట్రేడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 4.5 శాతం మేర క్షీణించి 95 డాలర్ల స్థాయికి తగ్గింది. మరోవైపు దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజూ తగ్గడం సైతం రూపాయిపై ప్రభావం చూపించింది.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక మాంద్యం ఆవరిస్తుందన్న భయాలతో భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి డాలర్లు మరింతగా తరలివెళతాయంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగుమతులకు డాలర్ చెల్లింపుల సామర్థ్యం తగ్గుతుందన్న అంచనాలు రూపాయిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచించే జాబ్‌లెస్ క్లెయిములు తాజాగా 8 నెలల గరిష్టస్థాయికి పెరిగినట్టు గురువారం గణాంకాలు వెలువడ్డాయి. ఈ ప్రభావంతో ఆఫ్‌షోర్ మార్కెట్లో రూపాయి విలువ 80.20 స్థాయికి పడిపోయింది.
అమెరికాలో జూన్ నెలకు ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ఠస్థాయి 9.1 శాతానికి పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీ పెంచుతుందన్న అంచనాలతో ఇతర దేశాల నుంచి డాలర్ నిధులు అమెరికాకు వేగంగా తరలివెళుతున్నాయి. దీంతో డాలర్ బలపడి, భారత్‌తో సహా పలుదేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ నెలలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను ఫెడ్ 0.75 శాతం పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.