తిరుమలలో భక్తుల రద్దీ ఏటా అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు టీటీడీ చర్యలు తీసుకుంటున్నా.. కొన్నిసార్లు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికే భక్తుల సంఖ్య విషయంలో తిరుమల పూర్తి సామర్థ్యానికి చేరిందనే వాదన కూడా ఉంది. దీనికి తోడు వీఐపీల పేరుత ప్రజాప్రతినిధులు చేస్తున్న హడావుడి కూడా భక్తులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.
సీజన్ తో సంబంధం లేకుండా తిరుమలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఒకప్పుడు వీకెండ్ లో ఉండే భక్తులు.. ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ అలాగే కనిపిస్తున్నారు. అదే స్థాయిలో హుండీ ఆదాయం వస్తోంది. ఆదాయానికి సంబంధించి జులైలో టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు నమోదు అయ్యింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం టాప్ ప్లేస్ లో ఉంటుంది. తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తూఉంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి ఆలయంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలి వస్తూనే ఉంటారు.
తిరుమల అంటే తెలుగోడి సెంటిమెంట్. ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో కేవలం కొన్ని సీజన్లలో మాత్రమే భారీగా భక్తులు వచ్చేవారు. వేసవి సెలవుల్లోనూ.. ప్రత్యక దినాల్లో అనూహ్యంగా భక్తుల రద్దీ ఉండేది.. ఇక మిగిలిన సీజన్లలో కేవలం వారంతాల్లో భారీగా రద్దీ ఉండేది. కానీ కరోనా తరువాత.. తిరుమల కొండకు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఓ వైపు వానలను లెక్క చేయడం లేదు.. స్కూళ్లు ఓపెన్ అయిన తరువాత రద్దీ తగ్గడం లేదు. కేవలం వీకెండ్స్ లోనే కాదు.. సాధారణ రోజుల్లోనూ శ్రీవారి దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.
70 సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తులు రోజుకి అక్షరాల 600 మంది మాత్రమే. సౌకర్యాలు పెరిగే కొద్ది శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. స్వామివారిని తలుచుకుంటే చాలు…తమ కష్టాలు గట్టెక్కుత్తాయని, శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు దాటింది. అయిప్పటికీ తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. అదే స్థాయిలో.. శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. జులై నెలలో టీటీడీలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.
శ్రీవారి భక్తులు కోనేటి రాయుడికి.. జులై నెలలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కాసుల వర్షం కురిపించారు. ఆ నెల శ్రీవారి ఆదాయం 20 రోజులకే 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఊహించని స్థాయిలో ఆదయం పెరగడంపై టీటీడీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. జులై 1వ తేదీనుంచి జులై 21వ తేదీ వరకు శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో ఈ జులై నెల4 వతేదీన అత్యధికంగా రూ. 6.18 కోట్లు ఆదాయం లభించింది. ఐదు నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.650 కోట్లను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదాయం 1500 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారుల అంచనా.
నిజానికి సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1992 వరకు కొనసాగింది.అప్పట్లో భక్తుల తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరిని కులశేఖరపడి వరకు అనుమతించేది టిటిడి.1950లో ఏడాది మొత్తానికి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది భక్తులు మాత్రమే.అంటే రోజుకి 619 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసేవారు. 1960 నాటికి ఈ సంఖ్య 11 లక్షల 67 వేలుకు చేరుకుంది. అప్పట్లో రోజుకి 3197 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవారు. 1970లో స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేల మంది అయితే, ప్రతి నిత్యం 9299 మంది భక్తులు శ్రీవారిని కులశేఖరపడి నుంచే దర్శించుకునేవారు. 1980లో ఏడాదికి శ్రీవారిని 79 లక్షల 52 వేల మంది భక్తులు దర్శించుకుంటే, రోజువారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య కూడా 21786 మందికి పెరిగింది. 1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది.
1990లో కోటి 18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం సరాసరి 32, 332 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2000లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రెండింతలైంది. ఆ ఏడాది 2కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే, రోజు వారి భక్తుల సంఖ్య 65 వేలకు చేరుకుంది. 2010లో 2 కోట్ల 55 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం 70 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2020 కి భక్తుల సంఖ్య ఏడాదికి 2 కోట్ల 70 లక్షల మంది భక్తులు కాగా, రోజులో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 75 వేలుగా వుంది.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతు వస్తూంటే, దర్శన విధానంలో కూడా టిటిడి మార్పులు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితుల వలన కులశేఖరపడి వరకు భక్తులును అనుమతిస్తే, గంటకు వెయ్యి మంది భక్తులుకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తూంది. అదే లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు రెండు నుంచి రెండున్నర వేలమంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. ఇక మహలఘు విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగున్నర వేల నుంచి ఆరు వేల మంది వరకు భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. ప్రస్తుతం భక్తుల తాకిడికి అనుగుణంగా టిటిడి మహలఘు దర్శన విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో స్వామివారిని 50 అడుగుల దూరం నుంచే మహాలఘు విధానంలో భక్తులు దర్శించుకుంటున్నారు.
కిక్కిరిసిన భక్తజనం తిరుమల కొండపైన కనిపించడం సర్వ సాధారణంగా మారిపోయింది. భక్తుల రద్దీతో పాటూ దర్శనంలో కూడా మార్పులు చేస్తూ వస్తోంది టీటీడీ. అయితే మరింత మంది భక్తులకు స్వామి దర్శనం అయ్యేలా సరికొత్త దర్శన విధానాలు కావాలనే డిమాండ్ పెరుగుతోంది.
తిరుమల కొండపైనే భక్తులు రావద్దు.. యాత్రను వాయిదా వేసుకోండి అన్న విజ్ఞప్తిని తరచూ వినాల్సి వస్తోంది. ఎందుకంటే సెలవు దొరికితే చాలు కొండెక్కుద్దామన్నటువంటి ఆలోచనలోకి భక్తులు వచ్చేస్తున్నారు. వరుస సెలవులు అయితే సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నారు. భక్తులు ఎవరైనా ముందస్తుగా ప్రణాళిక చేసుకోకుండా వస్తే ఇక్కడ ముప్పుతిప్పలు తప్పడం లేదనే టాక్ వినబడుతోంది. తిరుమల కొండపైనా రద్దీ ఎక్కువ అయితే వసతి సౌకర్యాలు కరువతాయి. దీంతో వచ్చిన యాత్రికులు తిప్పలు పడాల్సి వస్తుంది. దీంతో భక్తులను రావొద్దని టీటీడీ విజ్నప్తి చేయాల్సి వస్తోంది. అయితే సరైన ప్రణాళిక ఉంటే సమస్య తలెత్తదని అంటున్నారు భక్తులు.
శ్రీవారి దర్శనభాగ్యం కోసం ప్రతి భక్తుడు పరితపిస్తూ వుంటాడు.స్వామివారిని క్షణకాలం పాటు దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భావిస్తారు.ఎనిమిదన్నర అడుగులు శ్రీవారి దివ్యమంగళ స్వరూపాని అతి దగ్గర నుంచి దర్శించుకోవాలని పరితపిస్తూ వుంటారు.శ్రీవారి దర్శనానికి ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూండడంతో ప్రస్తూతం మహాలఘు దర్శన విధానాని టిటిడి అమలు చేస్తూంది.దినితో స్వామివారిని 50 అడుగులు దూరం నుంచే మహలఘు విధానంలో భక్తులుకు స్వామివారిని దర్శించుకుంటున్నారు.కాని సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1992 వరకు కోనసాగింది.అప్పట్లో భక్తులు తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరిని కులశేఖరపడి వరకు అనుమతించేది టిటిడి.
భక్తులు సంఖ్య పెరిగే కోద్ది క్యూ లైను విధానంలో కూడా టిటిడి మార్పులు చేస్తూ వచ్చింది. 1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ప్రవేశించే సౌలభ్యం వుండగా, 1970 కి భక్తులు సంఖ్య వందల నుంచి వేలకు చేరుకోవడంతో, పిపిసి షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టిటిడి. భక్తుల సంఖ్య 30 వేలకు చేరుకోవడంతో 1984లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను , 2001లో రెండో క్యూ కాంప్లెక్స్ నిభక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టిటిడి. ఆ తర్వాత కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ, దాదాపు 150 రోజులు పాటు క్యూ లైను వెలుపలికి వస్తూండడంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూ లైనులు ఏర్పాటు చేసింది టిటిడి. ఇలా భక్తులు తాకిడికి అనుగుణంగా క్యూ లైనులు మారుస్తూ వచ్చిన టిటిడి, దర్శనవిధానంలో కూడా భక్తులు రద్దికి అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చింది.
భక్తుల తాకిడి పెరిగే కొద్ది మార్పులు చేస్తూ వచ్చిన టిటిడి, ప్రస్తుతం తిరుమల పూర్తి సామర్థ్యానికి చేరుకుందని చెప్పుకోవచ్చు.ఆగమశాస్ర్తం మేరకు క్యూ లైను విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో, టిటిడి ప్రస్తూతం భక్తులు క్యూ లైనులో వేచివుండే అవసరం లేకుండా ఏర్పాట్లు చెయ్యడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ విధానంలో కేటాయిస్తూ, వారికి కేటాయించిన సమయానికి క్యూ లైను వద్దకు చేరుకుంటే రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినా, పూర్తి స్థాయిలో అమలు చెయ్యలేక పోవడంతో, ఇప్పుడు ప్రత్యామ్నాయం పై దృష్టి సారించింది టిటిడి.
తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం కొత్త పద్ధతిలో దర్శన సౌకర్యం ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. ఆగమ శాస్త్ర నిపుణుల సూచనలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై టీటీడీ లోతైన కసరత్తు చేయాలని కోరుతున్నారు భక్తులు. ఉన్న క్యూలైన్లు వేగంగా కదిలే ఏర్పాట్లు కూడా చేయాలని, అవసరమైతే వీఐపీ బ్రేక్ దర్శనాల్ని కుదించాలని చెబుతున్నారు. ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు.. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం తగ్గిస్తున్నట్టు ప్రకటనలు వస్తున్నా.. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
నిజానికి తిరుమల లాంటి భారీ రద్దీ ఉండే ఆలయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే టీటీడీ అనే వ్యవస్థ ఏర్పాటైంది. వందల మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తేనే.. భక్తులకు సాఫీగా దర్శనం అవుతుంది. ఎంతమంది భక్తులు కొండకు వచ్చినా.. వసతికి, దర్శనానికి ఇబ్బంది లేకుండా మెరుగైన మార్గాల్ని అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేవుడి ముందు అందరూ సమానమే అంటారు. కానీ ఒక్కోసారి తిరుమల దర్శనాలను గమనిస్తే, ఇది నిజం కాదేమో అనే అనుమానం వస్తోంది. సామాన్య భక్తులు వేలాదిగా దర్శనం కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో వీఐపీలు మాత్రం అనుచరుల గుంపుతో వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా, శ్రావణమాసం, సెలవులు వచ్చినప్పుడు మంత్రుల తీరు వివాదాస్పదంగా మారుతోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి TTD వివిధ రూపాల్లో వెసులుబాటు కల్పించింది. లో మొదటిది సర్వదర్శనం. దీనికి ఎలాంటి సిఫారసు అక్కర్లేదు. గంటల తరబడి క్యూ లైనులో వేచి ఉండాల్సి వచ్చినా సామాన్య భక్తులు అత్యధిక సంఖ్యలో ఈ విధానంలోనే దర్శనానికి వస్తారు. ఇక రెండోది 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. రోజూ 25 వేల టికెట్స్‌ను ఆన్‌లైన్ విధానంలో వీటిని అందుబాటులో ఉంచుతారు. మూడోది సిఫారసు లేఖలపై VIP దర్శనం. ఇవి కాకుండా వృద్దులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండా ప్రొటోకాల్ దర్శనం కల్పించే శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. సిఫారసు లేఖల దర్శనాలను ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న తీరు TTD ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇటీవల కాలంలో కొండపై కొందరు మంత్రుల ఓవర్ యాక్షన్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పెళ్లిళ్ల సీజన్‌తో పాటు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అంచనాకు మించి వుంది. క్యూకాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ కారణంగా టీటీడీ సిఫార్సు లేఖలపై ఆగస్టు 21 వరకు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. సర్వదర్శనానికి భారీగా టైమ్ పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలోనే మగ్గిపోతున్నారు. భక్తులతో ఇంత కిటికిటలాడుతున్నా, అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం టిటిడి నిర్ణయాలను పట్టించుకోవటం లేదు.
అనుచరగణంతో శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
ప్రధానంగా వీఐపీ అండ్ ప్రొటోకాల్ దర్శనాలతో సర్వదర్శనం సమయం అంతకంతకూ పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతోన్న భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతున్నారు. క్యూలైన్లలో భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొండపైకి ఉరుకులు పరుగులతో దూసుకొస్తున్న భక్తులకు సర్దిచెబుతూ పంపిస్తున్నారు.శ్రీవారి దర్శనం కోసం ఒకవైపు గంటల తరబడి పడిగాపులు పడుతున్న భక్తులు, మరోవైపు వానకు తడిచి, చలికి వణుకుతూ, గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
భక్తులు ఇన్ని కష్టాలు పడుతున్న సమయంలో అమాత్యుల తీరు చూస్తే, ఏడుకొండలవాడు ఎవరి వాడనే సందేహాలు రాకమానవు. ఏ పరపతి లేని సామాన్య భక్తులకు దైవ దర్శనానికి ఇలా కష్టాలు పడాల్సిందేనా అని భక్తులు నిలదీస్తున్నారు. భద్రత దృష్ట్యా, ప్రోటోకాల్ పరంగా మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వటంపై ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ, దాన్ని సాకుగా తీసుకుని మంత్రులు తండోపతండాలుగా అనుచరగణాన్ని కొండపైకి తరలిస్తున్న తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
సిఫారసు లేఖల దర్శనాలను మంత్రులు వినియోగిస్తున్న తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖపై ఆరుగురికి వీఐపీ దర్శనం కల్పిస్తారు. మంత్రి స్వయంగా వస్తే 10 మంది వరకు అనుమతి ఇస్తారు. కానీ.. ఈ నిబంధన పాటించడం లేదు కొందరు అమాత్యులు. రద్దీ రోజుల్లో సాధారణ భక్తులు వేలల్లో క్యూ లైన్‌లో గంటల తరబడి వేచి చూస్తున్నా..మంత్రులు పట్టించుకోవడం లేదు. తమతో వచ్చే అనుచరులు అందరికీ వీఐపీ దర్శనం కోసం నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అనుచర గణం చేసింది అదే. అంతకుముందు కూడా పలువురు మంత్రులు ఇదే తీరులో వ్యవహరించారు.
సామాన్య భక్తులేమైనా ఫర్వాలేదు.. అనుచరుల సేవలో తరిస్తే చాలనుకుంటున్నారు ప్రజాప్రతినిధులు.. గతంలో మంత్రులు గుమ్మనూరు జయరాం.. వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు తదితరులు ఇదే విధంగా పెద్ద సంఖ్యలో అనుచరులను దర్శనానికి తీసుకొచ్చారు. ఒకేసారి 60 నుంచి 80 మందిని తమతోపాటు ఆలయంలోకి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు.మంత్రి అప్పలరాజు అయితే ఏకంగా 150 మందితో వచ్చి ఆలయం దగ్గర చేసిన యాగి అంతా ఇంతా కాదు. వచ్చిన వాళ్లు అమాత్యులు కావడంతో.. TTD అధికారులు కూడా కాదన లేకపోతున్నారు. శ్రీవారి సాక్షిగా నిబంధనలకు నీళ్లొదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కళ్లెదుటే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు చీమ కుట్టినట్టు అయినా ఉండటం లేదు. తమతోపాటు.. వెంట వచ్చిన అనుచరుల సేవలో TTD తరిస్తే చాలు అనుకుంటున్నారు.
ప్రజాప్రతినిధుల రచ్చతో ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. ఏ పరపతిలేని సామాన్య భక్తులు దర్శనం కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వర్షం కురిస్తే నానా ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలో ఉన్న వారు వర్షం తాకిడికి పూర్తిగా తడిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రుల, ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని వస్తున్నారు.
తిరుమలలో ఇప్పటికైనా సామాన్యభక్తులకు పెద్దపీట వేసే విధానాలు రావాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలే పవిత్రతను దృష్టిలో పెట్టుకుని.. కలియుగ దైవం దర్శనం కోసం భక్తుల తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు. పుణ్యక్షేత్రమైన తిరుమలలో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీవారి దర్శనం జరిగేలా చూడాలని, అనవసర హడావుడి, ఆర్భాటాల్ని నివారించాలనే అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.